Bomb Threats: 24 గంటల్లో ఐదు విమానాలకు బాంబు బెదిరింపులు.. ఒకటి ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లింపు

5 flights get bomb threats in 24 hours

  • గత వారం రోజుల్లో 20 విమానాలకు బాంబు బెదిరింపులు
  • అన్నీ ఉత్తవేనని తేల్చిన అధికారులు
  • ఇలాంటి బెదిరింపులకు దిగేవారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్న విమానయానశాఖ

విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా ఐదు విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో విమానాలను మళ్లించడం, అత్యవసర ల్యాండింగ్ చేయించడం జరిగింది. బాంబు బెదిరింపులు అందుకున్న ఐదు విమానాల్లో మూడు విస్తారా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఈ ఉదయం వీటికి బెదిరింపులు వచ్చాయి. అయితే, ఇవన్నీ ఉత్తిత్తి బెదిరింపులేనని తేలింది. 

బాంబు బెదిరింపు అందుకున్న ఢిల్లీ-లండన్ విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్ మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అక్కడ తనిఖీల అనంతరం బాంబు బెదిరింపు ఉత్తదేనని తేలడంతో విమానం తిరిగి బయలుదేరింది. అలాగే, దుబాయ్ నుంచి 189 మంది ప్రయాణికులతో జైపూర్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి కూడా ఈమెయిల్ ద్వారా ఇలాంటి బెదిరింపే వచ్చింది. నిన్న బెంగళూరు నుంచి ముంబై వెళ్లాల్సిన ఆకాశ్ ఎయిర్ విమానానికి టేకాఫ్‌కు ముందు ఇలాంటి బెదిరింపే వచ్చింది. కాగా, గత వారం రోజుల్లో ఏకంగా 20 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గురువారం ఒక్క రోజే ఐదు బెదిరింపులు వచ్చాయి. అయితే, అన్నీ ఉత్తవేనని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

‘బాంబ్స్’, ‘బ్లడ్ విల్ స్ప్రెడ్ ఎవరీవేర్’, ‘ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్’, ‘దిస్ ఈజ్ నాటే జోక్’, ‘యు విల్ డై’, ‘బాంబ్ రఖ్వా దియా హై’ అని చెబుతూ నిందితులు బెదిరింపులకు దిగుతున్నారు. ఇలాంటి కేసులోనే ముంబైకి చెందిన 17 ఏళ్ల కుర్రాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి కాల్స్ చేసే వారిపై కఠిన చర్యలకు పౌర విమానయానశాఖ సిద్ధమవుతోంది.

Bomb Threats
Air India Express
Vistara
Civil Aviation
  • Loading...

More Telugu News