Satyendar Jain: రెండేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్.. స్వాగతం పలికిన కేజ్రీవాల్
- 2022 మే 30న అరెస్ట్ అయిన సత్యేంద్రజైన్
- విచారణ ఇంకా మొదలు కాకపోవడాన్ని ఎత్తి చూపిన కోర్టు
- మనీలాండరింగ్ వంటి కఠిన కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని ఎత్తి చూపిన న్యాయస్థానం
- బెయిలు మంజూరు చేస్తూ మనీశ్ సిసోడియా కేసులో సుప్రీం తీర్పు ప్రస్తావన
ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయన 18 నెలల సుదీర్ఘ కారాగారవాసాన్ని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఉటంకిస్తూ, ఇంకా విచారణే ప్రారంభం కాలేదని పేర్కొంటూ జైన్‌కు బెయిలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఆప్ నేత మనీశ్ సిసోడియా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించింది. సత్వర విచారణ హక్కును ప్రాథమిక హక్కుగా పేర్కొంది.
మనీలాండరింగ్ కేసులో సత్యేంద్రజైన్‌ను ఈడీ 2022 మే 30న అరెస్ట్ చేసింది. కోర్టు తీర్పును వెల్లడిస్తూ మనీలాండరింగ్ వంటి కఠిన చట్టాల విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని ఎత్తి చూపింది. కాగా, ఈ కేసును విచారిస్తున్న ఈడీ జైన్ బెయిలు దరఖాస్తును తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే, కేసు విచారణ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశం లేదని, త్వరలో కేసును ముగించాలని ఆదేశించింది.
హత్తుకుని ఆహ్వానించిన కేజ్రీవాల్
శనివారం తీహార్ జైలు నుంచి విడుదలైన సత్యేంద్రజైన్‌ను కేజ్రీవాల్ ఆహ్వానించారు. ‘వెల్కం బ్యాక్ సత్యేంద్ర’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. జైన్‌ను ఆలింగనం చేసుకున్న రెండు ఫొటోలను షేర్ చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం సత్యేంద్రజైన్ మాట్లాడుతూ.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రశ్నిస్తున్న వారిపై అణచివేతకు దిగుతోందని ఆరోపించారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.