Anil Kumble: మూడవ స్థానంలో కోహ్లీ వైఫల్యం వేళ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు

Anil Kumble suggested playing Kohli out of 3rdposition was a mistake

  • మూడవ స్థానంలో పుజారా లాంటి ఆటగాడు ఉండాలని సూచించిన మాజీ స్పిన్ దిగ్గజం
  • కోహ్లీని నాలుగవ స్థానంలో ఆడించి ఉండాల్సిందని అభిప్రాయం
  • ప్రతి బంతిని కొట్టాలనే భారత బ్యాటర్ల విధానాన్ని తప్పుబట్టిన అనిల్ కుంబ్లే

బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 46 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై భారత్‌కు ఇదే అత్యల్ప టెస్ట్ స్కోరు. కివీస్ బౌలర్ల ధాటికి యువ బ్యాటర్లతో పాటు సీనియర్లు కూడా స్వల్ప స్కోర్లకు పెవిలియన్ చేరారు. ముఖ్యంగా కీలకమైన 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 9 బంతులు ఆడి ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. దీంతో మూడవ స్థానంలో ఆడే బ్యాటర్‌పై చర్చ మొదలైంది.

గాయం కారణంగా యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ దూరమవడంతో ఈ మ్యాచ్‌లో మూడవ స్థానంలో కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. దీంతో 4వ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్‌కు దిగాడు. కోహ్లీ విఫలమైన నేపథ్యంలో మూడవ స్థానంలో బ్యాటింగ్‌పై టీమిండియా మాజీ కెప్టెన్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

మూడవ స్థానంలో కోహ్లీని ఆడించడం పొరపాటు అని కుంబ్లే వ్యాఖ్యానించాడు. కొత్త బంతిని ఎదుర్కోవాల్సిన ఆ స్థానంలో ఒక కీలక ఆటగాడు ఉండాలని సూచన చేశాడు. చటేశ్వర్ పుజారా లాంటి ఆటగాడు కొత్త బంతిని సమర్థవంతంగా ఎదుర్కోగలడని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. పుజారా మూడవ స్థానంలో చాలా సంవత్సరాలు బాగా రాణించాడని మెచ్చుకున్నాడు. 100 టెస్ట్ మ్యాచ్‌లకు పైగా అతడు ఆ స్థానంలో ఆడాడని, ప్రతి బంతిని కొట్టాలని చూసేవాడు కాదని గుర్తుచేశాడు. 

విరాట్ కోహ్లీని 4వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపించి ఉండాల్సిందని పేర్కొన్నాడు. నాలుగవ స్థానంలో కోహ్లీ తిరుగులేని నంబర్ వన్ బ్యాటర్ అని కుంబ్లే అన్నాడు. మరోవైపు భారత బ్యాటర్ల బ్యాటింగ్ విధానాన్ని కూడా కుంబ్లే తప్పుబట్టాడు. ప్రతి బంతిని ఆడటానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించాడు. బ్యాటర్లు బంతిని రానివ్వాలి కదా? అంటూ వారి బ్యాటింగ్ విధానాన్ని తప్పుబట్టాడు. పుజారా లాంటి వ్యక్తిని జట్టు కోల్పోతోందని కుంబ్లే వ్యాఖ్యానించాడు. భారత జట్టు బ్యాటింగ్ తీరు ఇబ్బంది పడేలా ఉందని తాను కచ్చితంగా చెప్పగలనని కుంబ్లే అన్నాడు. ఈ మేరకు ‘జియో సినిమా’తో మాట్లాడుతూ కుంబ్లే ఈ వ్యాఖ్యలు చేశాడు.

  • Loading...

More Telugu News