: అబద్ధపు హామీలతో శృంగారం అత్యాచారమే: ఢిల్లీ హైకోర్టు
పెళ్లి చేసుకుంటానంటూ అబద్దపు హామీలతో ఒక మహిళతో శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారమే అవుతుందని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 'భారతీయ నేర శిక్షా స్మృతి ప్రకారం ఒక మహిళ ఇష్టానికి విరుద్దంగా ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారం అవుతుంది. అయితే, పెళ్లి చేసుకుంటానంటూ తప్పుడు హామీలతో, నమ్మకాలతో అలాంటి పని చేసి ఉల్లంఘిస్తే అది అత్యాచారమే అవుతుంది' అంటూ జస్టిస్ ఆర్ వీ ఈశ్వర్ స్పష్టం చేశారు. అభిషేక్ జైన్ అనే నిందితుడిపై అతడి భార్య దాఖలు చేసిన కేసులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ను కొట్టేస్తూ ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.
అభిషేక్ పెళ్లికి ముందు ఆ యువతితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటాననే పేరుతో ఆ పని చేశాడు. కానీ తర్వాత చేసుకోనంటూ ప్లేట్ ఫిరాయించేసరికి ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అభిషేక్ ఆమెను గజియాబాద్ లోని ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నాడు. కానీ, ఆ తర్వాత తన నుంచి దూరంగా వెళ్లిపోవాలంటూ వేధింపులు ప్రారంభించాడు. దీంతో ఆ యువతి మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై బెయిల్ కోరుతూ అభిషేక్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం పిటిషన్ ను కొట్టేసింది.