KA Paul: ఎమ్మెల్యేలపై కేసులు పెట్టాను... చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు: కేఏ పాల్

KA Paul says he is receiving threat calls

  • ఇప్పటి వరకు తనను బెదిరించినవాళ్లు పోయారే తప్ప తనకేమీ కాలేదన్న కేఏ పాల్
  • ప్రజలకు మంచి చేయాలని తపనపడే తనపై కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం
  • చంద్రబాబు, పవన్ కల్యాణ్ పైనా విమర్శలు

తాను తెలంగాణలోని పదిమంది ఎమ్మెల్యేలపై కేసు పెట్టానని... దీంతో కేసులు ఉపసంహరించుకోవాలంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని... చంపేస్తామని హెచ్చరిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఓ నేత తనను చంపేస్తానని బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటి వరకు తనను బెదిరించిన వాళ్లు పోయారే తప్ప తనకు ఏమీ కాలేదన్నారు.

ప్రజలకు ఏదో మంచి చేయాలని తపనపడే తనపై కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించుకున్నానని... ఇక తనకు దేవుడే రక్షణ అని అన్నారు. తనపై కుట్రలు పన్నినవారు బాగుపడరని, చంపాలని కుట్ర చేస్తున్నవారు కచ్చితంగా చస్తారని పాల్ శపించారు.

గ్రూప్-1 విద్యార్థుల డిమాండ్‌ను కేఏ పాల్ సమర్థించారు. విద్యార్థులకు రెండు నెలల సమయం ఇస్తే నష్టమేమిటని ప్రశ్నించారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మలేదని, అందుకే ఓడిపోయిందన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఉంటే తెలంగాణకు మంచి జరుగుతుందని జోస్యం చెప్పారు. 

చంద్రబాబు పైనా విమర్శలు

బాబు రావాలి... జాబు రావాలని ఎన్నికలకు ముందు నినాదం ఇచ్చినప్పుడే... చంద్రబాబు వస్తే ఏదీ జరగదని చెప్పానని తెలిపారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదనే విషయం తెలిశాక ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 

ఏపీలో మంత్రులు, మాజీ మంత్రులు మద్యం వ్యాపారంలో వాటాలు అడుగుతున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పరిమితికి మించి ఖర్చు చేసే వారిని జీవితకాలం సస్పెండ్ చేయాలని వ్యాఖ్యానించారు. ఈవీఎంల బదులు బ్యాలెట్ పేపర్లే ఉపయోగించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు.

KA Paul
Telangana
Chandrababu
Andhra Pradesh
  • Loading...

More Telugu News