Etela Rajender: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటల రాజేందర్ కౌంటర్

Etala Rajendar counter to Revanth Reddy comments

  • మూసీ ప్రక్షాళనను తాము తప్పుబట్టడం లేదన్న ఈటల
  • మూసీని కాపాడుకోవడానికి తొలుత కెమికల్ నీళ్లు రాకుండా చూడాలని సూచన
  • టెక్నాలజీని వాడి మంచినీటిగా మార్చాలని సూచన

మూసీ పరీవాహక ప్రాంతంలో మూడు నెలల పాటు ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు విసిరిన సవాల్‌పై బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ... మూసీ ప్రక్షాళనను తాము తప్పుబట్టడం లేదన్నారు. అయితే మూసీని సంరక్షించుకోవాలంటే మొదట కెమికల్ నీళ్లు రాకుండా చూసుకోవాలని సూచించారు. టెక్నాలజీని వాడి మూసీ నీటిని మంచినీటిగా మార్చాలన్నారు.

అదే సమయంలో మూసీ సుందరీకరణకు, పరీవాహక ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతకు సంబంధం ఏమిటో చెప్పాలని నిలదీశారు. మురికినీటి సమస్యకు పరిష్కారం చూపిస్తే ఇళ్లు కూల్చే పరిస్థితి రాదన్నారు. అయినా సమయానికి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసి మూసీని అభివృద్ధి చేస్తుందా? అని మండిపడ్డారు.

గొప్ప మార్పు జరగాలంటే సాహసం చేయాలి: రేవంత్ రెడ్డి

గొప్ప మార్పు జరగాలంటే ఉక్కు సంకల్పంతో కూడిన సాహసం చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ మేరకు మూసీకి సంబంధించిన ఓ వీడియోను జత చేశారు. దశాబ్దాలుగా మూసీ గర్భంలో... జీవచ్ఛవాలుగా బతుకుతున్న... పేదల బతుకులు మార్చే సంకల్పం తనది అని పేర్కొన్నారు.

మూసీ సాగునీరుగా పారి... విషమే పంటలుగా మారి... నల్గొండ ప్రజల ఆరోగ్యాన్ని కబళిస్తున్న గరళ కూపాన్ని ప్రక్షాళన చేయాలన్న పట్టుదల తనది అని స్పష్టం చేశారు. 

హైదరాబాద్ చారిత్రక వైభవానికి... ఆనవాలుగా మిగిలిన మూసీని పునరుజ్జీవిపం చేసే లక్ష్యంతో పని చేస్తున్నానని తెలిపారు. విశ్వ నగరంగా ఎదుగుతోన్న మన హైదరాబాద్ నగర ఆర్థిక, పర్యాటక, వాణిజ్య రంగాల ఆయువు పట్టుగా మూసీని మార్చే బాధ్యత తనదే అని ఉద్ఘాటించారు. ఎన్ని దుష్టశక్తులు అడ్డు వచ్చినా... ఈ సంకల్పం చెరిగిపోదు... ఈ లక్ష్యం చెదిరిపోదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News