Revanth Reddy: కేటీఆర్, హరీశ్ రావు ఈటల మూడు నెలలు అక్కడ ఉంటే ప్రాజెక్టు రద్దు చేస్తాం: రేవంత్ రెడ్డి సవాల్
- ఆ నేతలు మూసీ పరీవాహక ప్రాంతంలో ఉండాలన్న సీఎం
- ఆ తర్వాత అక్కడి ప్రజల జీవితం బాగుందని చెప్పాలన్న రేవంత్ రెడ్డి
- ప్రాజెక్టుపై అనుమానాలు ఉంటే ఎల్లుండి లోగా పంపించాలని సూచన
సీఎం రేవంత్ రెడ్డి నేడు సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మూసీ ప్రక్షాళన అంశంపై మాట్లాడారు. అలాగే హైడ్రా కూల్చివేతలపై స్పందించారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని తాము భావిస్తున్నామన్నారు.
మూసీ ప్రాజెక్టుపై తన తప్పును నిరూపించేందుకు విపక్ష నేతలకు ఇదే మంచి అవకాశమన్నారు. బుల్డోజర్లు తమ మీద నుంచి పోనీయాలని పోటీ పడటం కాదు... కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ మూసీ పరీవాహక ప్రాంతంలోనే మూడు నెలలు ఉండి... అక్కడి జీవితం బాగుందని చెప్పాలన్నారు. వాళ్లు అక్కడ ఉంటామని చెబితే అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. వారు అక్కడ ఉంటే కనుక తాను వారి ఆరోపణలను ఖండించకుండా... ప్రాజెక్టును రద్దు చేస్తానని సవాల్ చేశారు. అవసరమైతే తన సొంత ఆస్తి అమ్మి ప్రభుత్వానికి నష్టం లేకుండా చేస్తానన్నారు.
అనుమానాలు ఉంటే ఎల్లుండి లోగా ఇవ్వండి
మూసీ ప్రక్షాళనపై ఏమైనా అనుమానాలు ఉంటే శనివారం లోగా తమకు పంపించాలని సూచించారు. మజ్లిస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు తాను ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నానని... మూసీపై అనుమానాలు ఉంటే ఎల్లుండి లోగా పంపించాలన్నారు. సమాధానం చెప్పాకే ముందుకు వెళతామన్నారు.
రాడార్ వ్యవస్థపై స్పందించిన రేవంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లాలో రాడార్ కేంద్రం ఏర్పాటుపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. దేశ భద్రతను రాజకీయాలతో ముడి పెట్టవద్దని సూచించారు. కొన్ని విషయాలను దేశభద్రత కోణంలో చూడాలని కోరారు. దేశభక్తి లేనివాడు కసబ్ కంటే హీనుడు అని మండిపడ్డారు. కేటీఆర్ కసబ్‌లా మారుతామంటే తమకు వచ్చే ఇబ్బందేమీ లేదన్నారు.