Meta: ఉద్యోగులపై మళ్లీ వేటుకు సిద్ధమైన ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా

Meta Ready To Fire Their Employees

  • ఇప్పటికే రెండు దఫాలుగా 21 వేల మందిని ఇంటికి పంపిన మెటా
  • దీర్ఘకాలిక వ్యూహాల పేరుతో మరోమారు ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం
  • ఈ ఏడాది ఆగస్టు నాటికి రోడ్డున పడిన 1.36 లక్షల మంది ఉద్యోగులు

టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తీసివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు వందలాదిమంది ఉద్యోగులను ఇంటికి పంపి తమ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోగా ఇప్పుడా జాబితాలోకి ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా మరోమారు చేరింది. ఈ సంస్థ ఇప్పటికే రెండు దఫాలుగా వేలాదిమందిని బయటకు పంపింది. తాజాగా, మెటా ఫరిధిలోని వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, వర్చువల్ రియాలిటీపై పనిచేస్తున్న రియాలిటీ ల్యాబ్ ఇలా అన్నింటిలోనూ ఉద్యోగుల సంఖ్యను కుదించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే, ఈ లేఆఫ్‌ల గురించి కానీ, ఎంతమందిని తొలగించాలనుకుంటున్న విషయాన్ని కానీ మెటా ధ్రువీకరించలేదు. ఆ సంస్థ అధికారి ప్రతినిధి మాత్రం.. దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు, ప్రాంతీయ వ్యూహాల్లో మార్పులు చేస్తున్నామని, అందులో భాగంగానే తొలగింపులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.

మెటా తన నిర్ణయాన్ని అమలు చేస్తే కనుక రిక్రూటింగ్, లీగల్ ఆపరేషన్, డిజైన్.. ఇలా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారిపై ప్రభావం పడే అవకాశం ఉంది. మెటా 2022లో 11 వేల మంది ఉద్యోగులను తొలగించింది. నిరుడు మరో 10 వేల మందిపై వేటేసింది. ఇప్పుడు మరికొందరిపై వేటుకు రంగం సిద్ధం చేసినట్టు వార్తలు వస్తుండగా, ఇప్పటికే తొలగింపునకు గురైన కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా, ఈ ఏడాది ఆగస్టు నాటికి 422 కంపెనీలు 1.36 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి.

  • Loading...

More Telugu News