Naga vamsi: గుంటూరు కారం విషయంలో ఆ తప్పులు జరిగాయి: నిర్మాత నాగవంశీ

Those mistakes were made in case of Guntur Karam Producer Naga vamshi

  • గుంటూరు కారం రాంగ్‌ టైటిల్‌ అంటోన్న నాగవంశీ 
  • నైజాం మినహా పంపిణీదారులందరూ సేఫ్‌ అని వెల్లడి 
  • గుంటూరు కారం నెగెటివ్‌ రివ్యూలతో తాను ఏకీభవించనన్న నాగవంశీ 

తెలుగు సినిమా నిర్మాతల్లో యువ నిర్మాత నాగవంశీది ఓ ప్రత్యేక శైలి. ఒకవైపు చిన్న సినిమాలతో పాటు, మరో వైపు భారీ చిత్రాలను ఆయన నిర్మిస్తుంటారు. అంతేకాదు వంశీ ఏదైనా మాట్లాడినా.. ముక్కుసూటిగా ఎలాంటి నిర్మొహమాటం లేకుండా మాట్లాడుతుంటాడు. తన సినిమాల గురించి కూడా ఆయన పోస్ట్‌మార్డం చేస్తుంటాడు. 

నాగవంశీ నిర్మాతగా మహేశ్ బాబు, త్రివిక్రమ్‌ కలయికలో వచ్చిన చిత్రం 'గుంటూరు కారం'. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను నుంచి మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ చిత్రం అనుకున్న విజయం ఎందుకు సాధించలేదని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాగవంశీని ప్రశ్నించారు. దానికాయన స్పందిస్తూ '' గుంటూరు కారం కమర్షియల్‌గా సేఫ్‌ ప్రాజెక్ట్‌, ఒక్క నైజాం మినహా ఎక్కడా కూడా ఈ సినిమా నష్టాలు తీసుకరాలేదు. ఇందులో అబద్ధం ఏమీ లేదు. సంక్రాంతికి హైదరాబాద్‌ నుంచి జనాలు ఆంధ్రాకు వెళ్లిపోవడం వల్ల ఇక్కడ సరిగ్గా పే చేయలేదు. గుంటూరు కారం కంటెంట్ విషయంలో ఎటువంటి తప్పు లేదు. ఆ విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాను. 

ఆ సినిమాకు వెబ్‌సైట్స్ లో రాసిన రివ్యూలు కరెక్ట్‌గా వున్నాయని నేను ఒప్పుకోను. మేము అనుకున్న సినిమా వేరు. మీరు అనుకున్న సినిమా వేరు. అందుకే మీరు సినిమా విషయంలో అలా స్పందించారు. కాకపోతే ఫ్యామిలీ సినిమాకు గుంటూరు కారం అనే మాస్‌ టైటిల్‌ పెట్టడం, ఇలాంటి ఫ్యామిలీ సినిమాకు అర్థరాత్రి ఒంటిగంటకు షో వేయడం వరకు ఆ సినిమా విషయంలో మా సైడ్‌ నుంచి తప్పు జరిగిందని అనుకుంటున్నాను'' అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

More Telugu News