Mohammad Haris: డ్రెస్సింగ్ రూమ్‌లో భార‌త్ గురించి మాట్లాడ‌టం నిషేధం.. సంచ‌ల‌న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టిన‌ పాక్ కెప్టెన్!

Talking About India Is Banned Pakistan A Captain Makes Sensational Revelation

  • ఈ నెల 18 నుంచి 27 వరకు ఒమన్‌లో ఏసీసీ టీ20 ఎమర్జింగ్ ఆసియా కప్ టోర్నీ
  • 19న‌ త‌ల‌ప‌డ‌నున్న చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్, పాకిస్థాన్ 
  • ఈ క్ర‌మంలో పాక్‌-ఏ జ‌ట్టు కెప్టెన్ మహ్మద్ హారిస్ వ్యాఖ్య‌ల తాలూకు వీడియో వైర‌ల్‌

ఈ నెల 18 నుంచి 27 వరకు ఒమన్‌లో ఏసీసీ టీ20 ఎమర్జింగ్ ఆసియా కప్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. 19న‌ చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్, పాకిస్థాన్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో పాక్‌-ఏ జ‌ట్టు కెప్టెన్ మహ్మద్ హారిస్ చేసిన వ్యాఖ్య‌ల తాలూకు వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. వీడియోలో అత‌డు డ్రెస్సింగ్ రూమ్‌లో భార‌త్ గురించి మాట్లాడ‌టం పూర్తిగా నిషేధమ‌ని చెప్ప‌డం ఉంది. 

అంతేగాక ఇలా చేయ‌డానికి కార‌ణాన్ని కూడా హారిస్ వివ‌రించాడు. చిరకాల ప్రత్యర్థి అయిన భారత్‌తో తలపడినప్పుడు త‌మ‌పై ఎప్పుడూ ఒత్తిడి ఉంటుందని తెలిపాడు. అందుకే త‌మ క్రికెటర్లపై ఎలాంటి అదనపు ఒత్తిడి ఉండ‌కూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.    

"మీకు ఒక విషయం చెబుతాను. డ్రెస్సింగ్ రూమ్‌లో భారత్‌ గురించి మాట్లాడటానికి మాకు అనుమతి లేకపోవడం ఇదే మొదటిసారి. మీరు భారత్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇతర జట్ల గురించి కూడా ఆలోచించాలి. నేను సీనియర్ పాకిస్థాన్ జట్టులో ఉన్నాను. గత ప్రపంచకప్ కూడా ఆడాను. టీమిండియా గురించి ఆలోచించ‌డం అనేది తీవ్ర‌మైన మాన‌సిక‌ ఒత్తిడిని సృష్టిస్తుంది. మేము ఇతర జట్ల‌ను కూడా ఎదుర్కోవాలి" అని హరీస్ చెప్ప‌డం వీడియోలో ఉంది.

ఇక ఈ టోర్నీలో భార‌త్‌-ఏ జ‌ట్టుకు యువ ఆట‌గాడు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అలాగే మ‌రో యువ సంచ‌ల‌నం అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. 21 ఏళ్ల తిల‌క్ వర్మ భార‌త్ త‌ర‌ఫున‌ నాలుగు వన్డేలు, 16 టీ20లకు ప్రాతినిధ్యం వ‌హించాడు. మ‌రోవైపు అభిషేక్ శర్మ టీమిండియాకు ఎనిమిది టీ20లు ఆడాడు. 

ఈ జట్టులో లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ కూడా ఉన్నాడు. వీరితో పాటు ఐపీఎల్ స్టార్స్‌ ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అనుజ్ రావత్, ఆయుశ్ బదోని, రమణదీప్ సింగ్, నెహాల్ వధేరా, వైభవ్ అరోరా, ఆర్ సాయి కిషోర్, హృతిక్ షోకీన్, రసిఖ్ సలామ్, ఆకిబ్ ఖాన్ ఉన్నారు. ఇక ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి. మునుపటి ఐదు ఎడిషన్లు 50 ఓవర్ల ఫార్మాట్‌లోనే జరిగాయి.

  • Loading...

More Telugu News