Arvind Kejriwal: బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
- జైల్లో ఉన్నప్పుడు ఇన్సులిన్ ఇవ్వకుండా బీజేపీ తనను చంపే కుట్ర పన్నిందన్న కేజ్రీవాల్
- తాను రోజూ నాలుగు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటానని వెల్లడి
- ఎల్జీని అడ్డుపెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు ఆపే ప్రయత్నం చేశారని ఆరోపణ
జైల్లో ఉన్నప్పుడు తనకు ఇన్సులిన్ ఇవ్వకుండా చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేంద్ర దర్యాఫ్తు సంస్థలు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం తెలిసిందే. దీంతో ఆయన కొన్ని నెలల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు.
తాజాగా, ఆయన మాట్లాడుతూ... తనకు మధుమేహం లెవల్స్ పెరిగాయని, దీంతో తాను రోజూ నాలుగు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటానని వెల్లడించారు. జైల్లో ఉన్న తాను ఇన్సులిన్ తీసుకోకపోతే కిడ్నీలు ఫెయిలై చనిపోయేలా వాళ్లు కుట్రలు పన్నారని బీజేపీని ఉద్దేశించి అన్నారు.
కానీ ఢిల్లీ ప్రజల ఆశీస్సులతో బయటకు వచ్చానన్నారు. గత పదేళ్ల కాలంలో ఎల్జీని అడ్డుపెట్టుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కానీ వారి ప్రయత్నాలను తాము తిప్పికొట్టామన్నారు.
పంజాబ్‌లో తమ గెలుపు తర్వాత... ఢిల్లీలో తమను ఆపకపోతే దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని వారు భయపడుతున్నారన్నారు. తాను జైల్లో ఉండగా ఢిల్లీ అభివృద్ధి పనులను ఆపేశారని, తాను జైలు నుంచి విడుదలయ్యాక వాటిని తమ ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందన్నారు.