Chandrababu: భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన
- ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు
- అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం
- ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
తిరుపతి, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు సహా పలు జిల్లాల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అలర్ట్‌గా ఉండాలని తెలిపారు. ఆకస్మిక వరదలకు అవకాశం ఉన్నందున యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.
అలాగే వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. ఇక భారీ వర్షాల కారణంగా జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో అధికారులు కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేశారు.
వాకాడు, గూడూరు, తడ, సూళ్లూరుపేట, కోట, చిల్లకూరు, వెంకటగిరిలో భారీ వర్షం కురుస్తోంది. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం రన్‌వేపైకి భారీగా నీరు చేరింది. దీంతో ల్యాండింగ్ సమస్య తలెత్తడంతో ఇండిగో ఫ్లైట్‌ను చెన్నైకి దారి మళ్లించారు.