Ratan Tata: 1996లో నాటి ప్రధాని పీవీ నరసింహారావుకు లేఖ రాసిన రతన్ టాటా.. చేతి రాత లేఖ వైరల్

Harsh Goenka shared a picture of a handwritten note of Ratan Tata addressed to former PM PV Narasimha Rao

  • నాటి ఆర్థిక సంస్కరణలను ప్రశంసించిన రతన్ టాటా
  • పీవీ నరసింహారావు విజయాలుగా అభివర్ణించిన టాటా గ్రూప్ మాజీ చైర్మన్
  • ఆసక్తికరమైన లేఖను షేర్ చేసిన ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా

దేశ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. విలువలతో కూడిన వ్యాపారాన్ని నిర్వహించిన ఆయనకు సంబంధించిన విశేషాలు ఏవో ఒకటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. 1996లో నాటి ప్రధాని పీవీ నరసింహారావుకు రతన్ టాటా రాసిన లేఖ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. రతన్ టాటాను గుర్తుచేసుకుంటూ ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా ఈ లేఖను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ‘‘ఒక అందమైన వ్యక్తి నుంచి అందమైన రచన...’’ అని గోయెంకా క్యాప్షన్ ఇచ్చారు.

పీవీ నరసింహారావును ఉద్దేశించి రతన్ టాటా ఈ లేఖను చేతితో రాశారు. భారతదేశానికి అత్యంత ఆవశ్యకమైన ఆర్థిక సంస్కరణలను చేపట్టారంటూ వ్యక్తిగతంగా మెచ్చుకుంటూ రతన్ టాటా ఈ లేఖ రాశారు. పీవీ నరసింహా రావు సాధించిన ‘అత్యుత్తమ విజయాలు’’ అని కొనియాడారు. భారతదేశాన్ని గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో ఒక భాగంగా మార్చారంటూ ప్రశంసల జల్లుకురిపించారు. సాహసోపేతంగా, దూరదృష్టితో సంస్కరణలు చేపట్టారని, ప్రతి భారతీయుడు తమరికి రుణపడి ఉండాలని లేఖలో రతన్ టాటా పేర్కొన్నారు. దేశ ఆర్థిక పురోగతి విషయంలో రతన్ టాటా ఎంత నిబద్ధతతో నడుచుకున్నారో ఈ లేఖను బట్టి అర్థం చేసుకోవచ్చు.

లేఖలో ఏముందంటే..
‘‘ప్రియమైన ప్రధాని పీవీ నరసింహారావు గారు, ఈ మధ్యకాలంలో మీ నిర్దయ ప్రస్తావనతో ఉన్న కొన్ని రిఫరెన్స్‌లను చదివాను. ఇతరుల జ్ఞాపకాలు చిన్నవి అయ్యిండవచ్చు. కానీ భారతదేశానికి అత్యంత అవసరమైన ఆర్థిక సంస్కరణలను తీసుకురావడంలో మీరు సాధించిన అత్యుత్తమ విజయాన్ని నేను ఎల్లప్పుడూ గుర్తించి, గౌరవిస్తానని మీకు తెలియజేయడానికి ఈ లేఖ రాస్తున్నాను. మీరు, మీ ప్రభుత్వం ఆర్థిక విషయంలో భారతదేశాన్ని ప్రపంచ పటంలో పెట్టారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మిమ్మల్ని భాగస్వామ్యం చేశారు. సాహసోపేతంగా, దూరదృష్టితో మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రతి భారతీయుడు మీకు కృతజ్ఞతతో రుణపడి ఉండాలి. మీరు సాధించిన విజయాలు కీలకమైనవి, అత్యద్భుతమైనవని నేను వ్యక్తిగతంగా విశ్వసిస్తున్నాను. ఆ విజయాలను ఎప్పటికీ మరచిపోకూడదు.

భారతదేశ భవిష్యత్ సంతోషకరంగా ఉంటుందని మీకు తెలియజేయడమే నా లేఖ ఉద్దేశం. మీరు సాధించిన వాటిని ఎప్పటికీ మరచిపోలేని ఒక్క వ్యక్తైనా ఉంటారని మీకు చెప్పదలచుకున్నాను. వ్యక్తిగతంగా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ భవదీయుడు రతన్ టాటా’’ అని లేఖలో రతన్ టాటా పేర్కొన్నారు.

కాగా ఈ లేఖను వ్యక్తిగతంగా రాస్తున్నానని రతన్ టాటా పేర్కొన్నారు. టాటా గ్రూప్ నాటి ప్రధాన కార్యాలయం ‘బాంబే హౌస్’ నుంచి ఒక కాగితంపై ఆయన ఈ లేఖను రాశారు.

మరోవైపు.. 1996లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేసే సంస్కరణలను నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంస్కరణ కారణంగానే భారత ఆర్థిక వ్యవస్థ కోలుకొని ప్రస్తుతం పురోగమన పథంలో పయనిస్తోంది. అందుకే మాజీ ప్రధాని నరసింహారావును ‘భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు’ అని పిలుస్తుంటారు.

  • Loading...

More Telugu News