Pakistan: విదేశాంగ మంత్రి జైశంకర్ అడుగుపెట్టిన కొన్ని గంటలకే పాకిస్థాన్ కీలక వ్యాఖ్యలు

Pakistan said it was for India to decide if it wants to have a bilateral meeting

  • ద్వైపాక్షిక చర్చలపై నిర్ణయించుకోవాల్సింది భారతేనన్న ఆ దేశ మంత్రి అహ్సాన్ ఇక్బాల్
  • షాంఘై సదస్సు ఆతిథ్య దేశంగా తాము ప్రతిపాదన చేయలేమని వ్యాఖ్య
  • ద్వైపాక్షిక చర్చలకు భారత్ ప్రతిపాదన చేస్తే చాలా సంతోషిస్తామని వెల్లడి

పాకిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ నిన్ననే (మంగళవారం) ఇస్లామాబాద్ చేరుకున్నారు. భారత ప్రతినిధుల బృందంతో కలిసి ఆయన వెళ్లారు. అయితే జైశంకర్ తమ దేశంలో అడుగుపెట్టిన కొన్ని గంటల తర్వాత పాకిస్థాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. షాంఘై సదస్సుతో పాటు పాకిస్థాన్‌తో విడిగా ద్వైపాక్షిక చర్చలు జరపాలా? లేదా? అనేది నిర్ణయించుకోవాల్సింది భారతదేశమేనని ఆ దేశ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ వ్యాఖ్యానించారు. షాంఘై సదస్సు కోసం తమ దేశానికి వచ్చిన అతిథులు ఏమి కోరుకున్నా దాని ప్రకారం నడచుకుంటామని ఆయన అన్నారు.

‘‘ ద్వైపాక్షిక చర్చలకు మేము ప్రతిపాదన చేయలేం. అతిథుల నిర్ణయం ప్రకారమే మేము నడచుకుంటాం. అతిథులు ద్వైపాక్షిక సమావేశం కావాలనుకుంటే మేము చాలా ఆనందిస్తాం. ఆతిథ్యం ఇస్తున్న దేశంగా ద్వైపాక్షిక చర్చల విషయంలో మేము ఎవరినీ ప్రభావితం చేయలేం’’ అని అహ్సాన్ ఇక్బాల్ స్పష్టం చేశారు. భారత్-పాకిస్థాన్ విదేశాంగ మంత్రుల మధ్య ద్వైపాక్షిక సమావేశాన్ని ప్రతిపాదించాలనుకుంటున్నారా? అని మీడియా ప్రశ్నించగా ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

ఇక భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించాలని పాకిస్థాన్ కోరుకుంటుందా? అని ప్రశ్నించగా... ‘లాహోర్ డిక్లరేషన్’ స్ఫూర్తితో ఇరు దేశాలు నడచుకోవాలని అహ్సాన్ వ్యాఖ్యానించారు. లాహోర్ డిక్లరేషన్‌ను స్ఫూర్తిగా తీసుకుంటే ఇరు దేశాలు కలిసి పరిష్కరించలేని సమస్య ఏమీ ఉండబోదని తాను భావిస్తున్నట్టు ఆయన చెప్పారు.

కాగా షాంఘై సదస్సులో భాగంగా భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సమావేశాన్ని ఇరుదేశాలు ఇప్పటికే తోసిపుచ్చాయి.  

  • Loading...

More Telugu News