Skill Development Case: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కీలక పరిణామం
- స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారం ఈడీ దర్యాప్తు
- సీమెన్స్ సంస్థ ఆస్తుల అటాచ్
- ఢిల్లీ, ముంబయి, పుణే నగరాల్లోని ఆస్తుల అటాచ్
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ.23.54 కోట్ల మేర ఆస్తులు అటాచ్ చేసినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు ప్రకటించింది. ఢిల్లీ, పుణే, ముంబయి నగరాల్లోని సీమెన్స్ సంస్థ ఆస్తులు అటాచ్ చేసినట్టు ఈడీ వెల్లడించింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో స్థిర, చరాస్తులు ఉన్నాయి.
ఏపీ సీఐడీ కేసు ఆధారంగా స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో ఈడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ అంశంలో నకిలీ ఇన్ వాయిస్ లతో వస్తువులు కొనుగోలు చేసినట్టు, నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్టు ఈడీ దర్యాప్తులో గుర్తించినట్టు తెలుస్తోంది. డీటీసీఎల్ ఎండీ ఖాన్విల్కర్, సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, ముకుల్ చంద్ ల ఆస్తులను కూడా అటాచ్ చేసినట్టు సమాచారం.
ఈ కేసులోనే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో జైలుకు వెళ్లారు. ఆయనను సీఐడీ అరెస్ట్ చేయడంతో 53 రోజులు జైల్లో ఉన్నారు.