Jagan: ఇలాంటి ఐరన్ ఫెన్సింగ్ ఏ దేశాధ్యక్షుడి ఇంటికీ లేదు: జగన్ పై పట్టాభి ఫైర్
- తాడేపల్లిలో జగన్ ఇంటి ఫెన్సింగ్ కు రూ.12.85 కోట్లు దుర్వినియోగం చేశారన్న పట్టాభి
- గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ అంటూ విమర్శలు
- ప్రపంచంలో ఇలా ఎవరూ నిర్మించుకోలేదని వ్యాఖ్యలు
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విలాసాల కోసం వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ విలాసాలకు ఖర్చు చేసిన వాటి నిదర్శనాలు ప్రత్యక్షంగా ప్రతిరోజు కనిపిస్తున్నాయని విమర్శించారు.
అది తాడేపల్లి ప్యాలెస్ అయినా, రుషికొండ ప్యాలెస్ లోని బాత్ టబ్ లు అయినా... ఇలా ఒకటేమిటి... కబోర్డ్ ల నుంచి మసాజ్ టేబుళ్ల వరకు నిధులు విచ్చలవిడిగా ఖర్చు చేశారని ధ్వజమెత్తారు.
"పేదలకు దక్కాల్సిన సొమ్మును ఇష్టానుసారంగా తినేసి... సొంత ఖజానాకు చేర్చుకుని... మిగిలింది తన విలాసాల కోసం ఖర్చు చేశాడు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ భారీ ఎత్తున ఇనుప కంచెను పెట్టుకున్నాడు. ఈ విధంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, దేశ ప్రధాని అయినా, దేశ అధ్యక్షుడైనా... ప్రపంచంలో ఇలా ఎవరైనా నిర్మించుకున్నారా?
తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప కంచె దాదాపు 25–30 అడుగులు ఉంటుంది. జగన్ ఇంటి సమీపంలోనే ఎంతో మంది పేదవాళ్లు తమ కష్టంతో రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. జగన్ ఈ పేద వాళ్ల మొహం చూడకూడదని ఆ పేద వాళ్ల ఇళ్లను కూల్చేసి రహదారి, చుట్టూ గ్రీనరీ, డిజైనర్ లైట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోడ్డులోకి ఏ సామాన్యమైన వ్యక్తిని కూడా అనుమతించలేదు.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రోడ్డులో ప్రయాణించడానికి సామాన్యులకు అనుమతులిచ్చారు. ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా... ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలో ఎవరూ కూడా ఇంటి చుట్టూ ఇలాంటి ఇనుప కంచెను ఏర్పాటు చేసి ఉండరు.
జీఏడీ విడుదల చేసిన అధికార సమాచారం మేరకు ఇనుప కంచె ఏర్పాటుకు 12 కోట్ల 85 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. భద్రత పేరుతో అమరారెడ్డి కాలనీలోని ఇళ్లను రాత్రికి రాత్రే ధ్వంసం చేశారు. దీంతో 318 పేదల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇళ్లు కూల్చే రోజు మహిళలు అని కూడా చూడకుండా ఈడ్చిపడేశారు.
ఇనుప కంచె ఏర్పాటు చేసుకుని లోపల పిల్లిలా ఉండటం సింహం లక్షణమా... ఇది చూస్తే పిల్లి కూడా సిగ్గు పడుతుంది. జగన్ భయం ఖర్చు 12 కోట్ల 85 లక్షల రూపాయలా? గతంలో హిట్లర్ కూడా ఇలానే ఉండేవాడు. రాష్ట్రపతి భవన్ చుట్టూ కూడా ఇలాంటి కంచె లేదు. దేశ అధ్యక్షుడు కంటే జగన్ కు ఏమైనా అధికంగా ముప్పు ఉందా? భారతదేశ రాష్ట్రపతి కంటే జగన్ ఏమైనా వీవీఐపీనా.. ఇలాంటి ఇనుప కంచె దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి చుట్టూ కూడా లేదు.
లిబియాలో గడాఫి ప్యాలెస్ చుట్టూ, ఇరాక్ లో సద్దామ్ హుస్సేన్ ప్యాలెస్ చుట్టూ కూడా పెద్ద పెద్ద గోడలు ఉండేవి. ఎవరైతే ప్రజలను అణిచివేసి నియంతలా వ్యవహరిస్తారో వాళ్లకి మాత్రమే ఇనుప కంచెలు ఏర్పాటు చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు ఇంట్లో లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు ప్రతిరోజు కొన్ని వందల మంది వస్తున్నారు. ఇదీ ప్రజా పరిపాలన అంటే.
ఈ ఇనుప కంచెకే కాకుండా రంగులకు రూ.3 వేల కోట్లు, సర్వే రాళ్లపైనా జగన్ బొమ్మలకు రూ.700 కోట్లు, రుషికొండపై విలాసవంతమైన భవనం నిర్మించుకోవడానికి రూ.600 కోట్లు, సాక్షి దినపత్రికకు యాడ్స్ పేరుతో రూ.500 కోట్లు, పట్టాదారు పాస్ పుస్తకాలపైన జగన్ బొమ్మలకు రూ.13 కోట్లు, తాడేపల్లి ప్యాలెస్ లో వివిధ రకమైన ఖర్చులకు రూ.15 కోట్లు, ఎగ్ పఫ్ లకు రూ.3 కోట్ల 60 లక్షలు... ఈ విధంగా దాదాపుగా రూ.5000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు.
కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఫర్నిచర్ ను తిరిగి ఇవ్వమంటే... చెక్కు రాసి ఇస్తా అంటున్నావు... ఫర్నిచర్ తిరిగి ఇవ్వడానికి చెక్కు రాయడం కాదు... ఈ రూ.5000 కోట్లకు చెక్కు రాయి.. స్పీకర్ హోదాలో అప్పటి ప్రభుత్వం కోడెల శివప్రసాద్ కు ఫర్నిచర్ కేటాయిస్తే దానిపై కూడా బ్లూ మీడియాలో లేనిపోని రాతలు రాసి.. ఆయన్ను దొంగగా చిత్రీకరించి... మనోవేదనకు గురిచేశారు.
మా అభిమాన నాయకుడు కోడెల శివప్రసాద్ పై అకారణంగా నిందలు వేసి ఆయన మరణానికి కారకుడివయ్యావు. మరి ఇప్పుడు నువ్వు ప్రజాధనం దుర్వినియోగం చేసి ఖర్చు చేసిన రూ.5000 కోట్ల రూపాయలకు ఏమి సమాధానం చెబుతావు?" అంటూ పట్టాభి ప్రశ్నించారు.