Rajnath Singh: రాడార్ కేంద్రానికి రేవంత్ రెడ్డి సహకరించారు: రాజ్‌నాథ్ సింగ్ అభినందన

Rajnath Singh lays foundation stone for naval radar station in Telangana

  • సీఎంతో కలిసి వికారాబాద్ జిల్లాలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌కు శంకుస్థాపన
  • పార్టీలు వేరైనప్పటికీ దేశ అభివృద్ధిలో అందరూ కలిసి ముందుకు సాగాలని సూచన
  • కమ్యూనికేషన్‌లో పావురాలు, గుర్రాల దశ నుంచి ఈ స్థాయికి వచ్చామన్న కేంద్రమంత్రి

వీఎల్ఎఫ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా సహకరించారని, అందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నానని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. వికారాబాద్ జిల్లాలో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ రాడార్ స్టేషన్‌కు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్రమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీలు వేరైనప్పటికీ దేశ అభివృద్ధిలో అందరూ కలిసి ముందుకు సాగాలని సూచించారు.

రక్షణ రంగ పరికరాల తయారీలో హైదరాబాద్‌కు మంచి పేరు ఉందని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకంగా మారిందన్నారు. అబ్దుల్ కలాం జయంతి రోజున ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు ఆనందంగా ఉందన్నారు. దేశ భద్రతకు వీఎల్ఎఫ్ స్టేషన్ కీలకమని, కమ్యూనికేషన్ విషయంలో ఈ కమాండ్ సెంటర్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. దేశ రక్షణకు ఇది అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.

పావురాలు, గుర్రాల దశ నుంచి ఈ స్థాయికి వచ్చాం

కమ్యూనికేషన్ రంగంలో మనం పావురాలు, గుర్రాల దశ నుంచి ఇక్కడి వరకు వచ్చామన్నారు. తపాలా వ్యవస్థను అనేక ఏళ్ళు వినియోగించుకున్నామని కేంద్రమంత్రి అన్నారు. ఇప్పుడంతా ఇంటర్నెట్ యుగమని, క్షణాల్లో సమాచారం ప్రపంచానికి చేరుతోందన్నారు. సమాచార విప్లవం ఈరోజు దేశాలన్నింటినీ దగ్గర చేస్తోందని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లో సమాచార విప్లవం కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. ఇంట్లో కూర్చొని అనేక కోర్సులు నేర్చుకుంటున్నారని తెలిపారు. 

రాడార్ స్టేషన్ కోసం 2,900 ఎకరాల భూమి అప్పగింత

ఇది భారత నౌకాదళానికి సంబంధించిన వెరీ లో ఫ్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) రాడార్ స్టేషన్. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో శంకుస్థాపన చేశారు.  

రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం ఇక్కడి అటవీ శాఖకు చెందిన 2,900 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం ఆరు నెలల క్రితం విశాఖపట్నం కేంద్రంగా పని చేస్తోన్న ఈస్టర్న్ నావెల్ కమాండ్‌కు అప్పగించింది. ఇక్కడ రాడార్ స్టేషన్‌తో పాటు టౌన్ షిప్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో స్కూల్స్, హాస్పిటల్స్, బ్యాంకు, మార్కెట్ తదితర సదుపాయాలు ఉండనున్నాయి. 

ఈ టౌన్ షిప్‌లో 3,000 మంది వరకు నివసించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు, సిబ్బంది 600 మందికి పైగా ఉంటారు. ఈ వీఎల్ఎఫ్ కేంద్రాన్ని 2027 లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

  • Loading...

More Telugu News