Uttarakhand: రైలు పట్టాలపై హైటెన్షన్ వైరు... ఉత్తరాఖండ్‌లో తప్పిన పెను ప్రమాదం
- ఉత్తరప్రదేశ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలో ఘటన
- డెహ్రాడూన్ నుంచి తనక్‌పూర్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు
- దూరం నుంచే గుర్తించి ఎమర్జెన్సీ బ్రేకులు వేసిన లోకో పైలట్లు
- గుర్తు తెలియని వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
- విచారణకు ఆదేశించిన రైల్వే అధికారులు
రైల్వే ట్రాక్‌లపై బండరాళ్లు, గ్యాస్ సిలిండర్లు పెట్టిన ఘటనలు ఇటీవల వరుసగా వెలుగు చూస్తుండగా తాజాగా ఓ హైటెన్షన్ వైరును దుండగులు రైల్వే ట్రాకుపై పడేశారు. లోకో పైలట్ దూరం నుంచే దీనిని గమనించి ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిందీ ఘటన.
డెహ్రాడూన్ నుంచి తనక్‌పూర్ వెళుతున్న వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఖాతిమా రైల్వే స్టేషన్ దాటిన తర్వాత రైల్వే ట్రాక్‌పై 15 మీటర్ల పొడవున్న హైటెన్షన్ వైరు పడి ఉండడాన్ని లోకోపైలట్లు గుర్తించారు. ఆ వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పింది. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాకుపై పడి ఉన్న హైటెన్షన్ వైరును తొలగించి రైలు వెళ్లేందుకు రూట్ క్లియర్ చేశారు.
ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. గుర్తు తెలియని నిందితులపై భారతీయ న్యాయ్ సంహిత (బీఎన్ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గత నెలలోనూ లోకో పైలట్ల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాగ్‌రాజ్ నుంచి భివానీ వెళుతున్న కాళింది ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్లు రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్‌ను గుర్తించి ఎమర్జెన్సీ బ్రేకులు వేసినప్పటికీ అది సిలిండర్‌ను నెమ్మదిగా ఢీకొట్టి ఆగింది. ఈ ఘటనపైనా దర్యాప్తు జరుగుతోంది.