KTR: కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతోంది: కేటీఆర్‌

BRS Working President KTR Criticizes Congress Government

  • 'ఎక్స్' వేదిక‌గా కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై కేటీఆర్ సుదీర్ఘ పోస్టు
  • ఒక్క గ్యారెంటీ క‌రెక్టుగా అమలు చేసింది లేదంటూ విమ‌ర్శ‌
  • అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలేన‌న్న కేటీఆర్

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ మ‌రోసారి కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతోంద‌ని చుర‌క‌లంటించారు. విద్యుత్ సరఫరా కు గ్యారెంటీ లేదు కానీ విద్యుత్ షాకులు మాత్రం గ్యారెంటీ అని అన్నారు. పవర్ లోకి వచ్చి ఏడాది కాకముందే పవర్ చార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారంటూ దుయ్య‌బ‌ట్టారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా కేటీఆర్ ఒక పోస్ట్ పెట్టారు. 

"కరెంటు కోతల కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాతలు పెట్టేందుకు రెడీ అవుతుంది. విద్యుత్ సరఫరాకు గ్యారెంటీ లేదు కానీ విద్యుత్ షాకులు మాత్రం గ్యారెంటీ. పవర్‌లోకి వచ్చి ఏడాది కాకముందే, పవర్ చార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి సిద్ధమయ్యారు. ఫ్రీ కరెంట్ అమలు అంతంత మాత్రమే. గృహజ్యోతి పథకం ఇంకా గ్రహణంలోనే ఉంది. జీరో బిల్లుల కోసం ఎదురు చూస్తుంటే గుండె గుభిల్లు మనేలా కొత్త బాదుడు షురూ చేస్తారా.

ఒక్క గ్యారెంటీ సక్కగా అమలు చేసింది లేదు. 420 హామీలకు అతీ గతీ లేదు. మరి ఖజానా ఖాళీ చేసి ఏం చేస్తున్నారు. 9 నెలల్లో ఎడాపెడా అప్పులు చేసి తెచ్చిన రూ.77 వేల కోట్లు ఎటుబాయే? మళ్లీ ఈ నడ్డి విరిగే వడ్డనలు ఎందుకు? అసమర్థుల పాలనలో ఆఖరికి మిగిలేది కోతలూ వాతలే" అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

  • Loading...

More Telugu News