kadapa yogi vemana university: పదవి నుంచి వైదొలగిన కడప యోగి వేమన వర్సిటీ రిజిస్ట్రార్

kadapa yogi vemana university registrar resigns

  • రాజీనామా చేసిన యోగి వేమన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రాంప్రసాద్ రెడ్డి  
  • రిజిస్ట్రార్ రాజీనామాను ఆమోదించిన వైస్ ఛాన్సలర్ కృష్ణారెడ్డి
  • 2011లోనే విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొన్న రాంప్రసాద్ రెడ్డి 
  • రిజిస్ట్రార్‌గా రాంప్రసాద్ రెడ్డి నియామకంతో ఆందోళన చేసిన విద్యార్ధి సంఘాల నేతలు

కడప యోగి వేమన విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ తప్పెట రాంప్రసాద్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను వైస్ ఛాన్స్‌లర్ కృష్ణారెడ్డి ఆమోదించారు. విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్‌గా ఉన్న రాంప్రసాద్ రెడ్డి పది రోజుల క్రితమే రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే 2011లో విద్యార్థినులను విహారయాత్రకు తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు రాంప్రసాద్ రెడ్డిపై వచ్చాయి. దానిపై గతంలోనే త్రిసభ్య కమిటీ నియమించి విచారణ చేపట్టగా వేధింపులు నిజమని నిర్ధారణ కావడంతో ఆయనను దూరం పెట్టారు. 

అయితే వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలతో అంటకాగిన రాంప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాను టీడీపీకి విధేయుడిని అని ప్రచారం చేసుకుని జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తెచ్చుకుని యూనివర్శిటీ రిజిస్ట్రార్ గా బాధ్యతలు తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విద్యార్ధులకు నైతిక విలువలు నేర్పాల్సిన వర్శిటీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఉన్నత పదవులు కట్టబెట్టడం ఏమిటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 

రిజిస్ట్రార్ లైంగిక వేధింపుల బాగోతంపై ఆధారాలు సహా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు విద్యార్థి సంఘ నేతలు ఫిర్యాదు లేఖలు పంపించారు. వీసీ, రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇటీవల ఆందోళన కూడా చేశారు. వారిని విధుల నుండి తొలగించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే రాంప్రసాద్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.    
 

More Telugu News