NZ vs PAK: మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌.. న్యూజిలాండ్ చేతిలో పాక్ ప‌రాజ‌యం.. ఇంటిబాట ప‌ట్టిన టీమిండియా!

India Eliminated From Women T20 World Cup After New Zealand Beat Pakistan

  • దుబాయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌, పాకిస్థాన్ మ్యాచ్‌
  • 54 ప‌రుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌
  • ఘ‌న విజ‌యంతో సెమీస్ చేరిన కివీస్‌
  • ఈ మ్యాచ్‌లో పాక్ గెలిచి ఉంటే.. భార‌త్‌కు సెమీస్ అవ‌కాశం 
  • పాకిస్థాన్ ఓట‌మితో టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన టీమిండియా

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జ‌రుగుతున్న మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టు ప‌య‌నం ముగిసింది. గ్రూప్ ద‌శ నుంచి టీమిండియా ఇంటిముఖం ప‌ట్టింది. నాలుగు మ్యాచుల్లో రెండు విజ‌యాలు, రెండు ప‌రాజ‌యాల‌తో భార‌త జ‌ట్టు అమ్మాయిలు టోర్నీ నుంచి నిష్క్ర‌మించారు. 

సోమ‌వారం న్యూజిలాండ్‌, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో పాక్ గెలిచి ఉంటే.. మంచి నెట్ ర‌న్ రేట్ కార‌ణంగా హ‌ర్మ‌న్ ప్రీత్ సేన‌కు సెమీస్ అవ‌కాశాలు ఉండేవి. కానీ, అనూహ్యంగా పాకిస్థాన్ జ‌ట్టు భారీ ఓట‌మిని చవిచూసింది. దీంతో భార‌త జ‌ట్టు సెమీ ఫైన‌ల్ రేసు నుంచి నిష్క్ర‌మించ‌గా.. కివీస్ సెమీ ఫైన‌ల్‌కి దూసుకెళ్లింది.  

దాంతో 2016 త‌ర్వాత కివీస్‌ తొలిసారి సెమీస్ బెర్త్ క‌న్ఫార్మ్ చేసుకున్న‌ట్టయింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 111 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో పాక్ 56 ర‌న్స్‌కే ఆలౌట్ అయింది. దీంతో కివీస్ 54 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. 

ఇక సెమీస్‌కు అర్హత సాధించేందుకు పాకిస్థాన్ 12 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా.. 11.4 ఓవ‌ర్ల‌లో 56 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బౌల‌ర్లు రాణించ‌డంతో పాక్ బ్యాట‌ర్లు త‌డ‌బ‌డ్డారు. ఏకంగా న‌లుగురు డ‌కౌట్ అయ్యారు. 

కివీస్ బౌల‌ర్ల‌లో స్పిన్నర్ అమేలియా కెర్ 3 వికెట్లు పడగొట్ట‌గా, ఈడెన్ కార్సన్ 2, లీ తహుహు ఒక వికెట్ తీశారు. అంత‌కుముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు సుజీ బేట్స్ (28), జార్జియా ప్లిమ్మర్ (17) తొలివికెట్‌కు 41 పరుగులు జోడించి మంచి భాగ‌స్వామ్యం అందించారు. 

ఆ త‌ర్వాత పాక్ బౌల‌ర్లు వ‌రుస విరామాల్లో వికెట్లు తీసి, 110 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేశారు. కానీ, బ్యాటింగ్‌లో పాకిస్థాన్ ఘోరంగా విఫ‌ల‌మైంది. 111 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక చ‌తికిల ప‌డింది. చివ‌రికి 54 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. భారీ విజ‌యంతో న్యూజిలాండ్ సెమీస్‌లోకి ప్ర‌వేశించింది.

More Telugu News