Emerging Teams Asia Cup: తిలక్ వర్మకు కెప్టెన్సీ ఛాన్స్
- ఈ నెల 18 నుంచి ఒమన్‌లో జరగనున్న ఎమర్జింగ్ ఆసియా కప్
- ఈ టోర్నీ కోసం తాజాగా భారత్-ఏ జట్టును ప్రకటించిన బీసీసీఐ
- జట్టులో ఐపీఎల్ స్టార్స్‌తో పాటు యువ సంచలనం అభిషేక్ శర్మకు చోటు
- తొలిసారి టీ20 ఫార్మాట్‌లో టోర్నమెంట్
ఈ నెల 18 నుంచి ఒమన్‌లో జరగనున్న ఎమర్జింగ్ ఆసియా కప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత్-ఏ జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే ఈ జట్టులో యువ సంచలనం అభిషేక్ శర్మ, స్పిన్నర్ రాహుల్ చాహర్‌లకు కూడా చోటు దక్కింది.
వీరితోపాటు ఐపీఎల్‌లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు ఆయుశ్ బదోని (లక్నో సూపర్ జెయింట్స్), రమన్‌దీప్ సింగ్ (కోల్‌కతా నైట్ రైడర్స్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (పంజాబ్ కింగ్స్), నేహాల్ వదేరా (ముంబై ఇండియన్స్), అనుజ్ రావత్ (ఆర్‌సీబీ), ఆర్ సాయి కిషోర్ (గుజరాత్ టైటాన్స్), హృతిక్ షోకీన్, రసిఖ్ సలామ్ (ఢిల్లీ క్యాపిటల్స్), వైభవ్ అరోరా (కోల్‌కతా నైట్ రైడర్స్), ఆకిబ్ ఖాన్‌లకు చోటు లభించింది. అలాగే అండర్-19 వరల్డ్‌కప్-2022లో అదరగొట్టిన ఆల్‌రౌండర్ నిశాంత్ సింధుకు కూడా అవకాశం లభించింది.
ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్-బీలో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ జట్లు ఉన్నాయి. గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుతాయి. అక్టోబర్ 25న సెమీస్, అక్టోబర్ 27న ఫైనల్ జరగనుంది. అక్టోబరు 19న పాకిస్థాన్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.
ఇక టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరగడం ఇదే మొదటిసారి. గతంలో జరిగిన ఐదు ఎడిషన్‌లు 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగాయి. 2013లో ప్రారంభ ఎడిషన్‌ను భారత్ గెలుచుకోగా, గత రెండుసార్లు పాకిస్థాన్ టైటిల్ గెలుచుకుంది. 2023లో పాకిస్థాన్ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి టైటిల్ ఎగిరేసుకుపోయింది.
భారత్-ఏ జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఆయుశ్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా, అన్షుల్ కాంబోజ, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా, రసీక్ సలామ్, సాయి కిశోర్, రాహుల్ చాహర్.