Baba Siddique Murder Case: బాబా సిద్దిఖీ హత్యకేసు నిందితుడు బాలుడు కాదు.. తేల్చేసిన బోన్ అసిఫికేషన్ టెస్ట్

Baba Siddique murder accused not a minor

  • తన కార్యాలయం బయటే హత్యకు గురైన సిద్దిఖీ
  • తాను మైనర్‌నన్న షూటర్ ధర్మరాజ్ కశ్యప్
  • కోర్టు ఆదేశాలతో ఎముకల ఎదుగుదల పరీక్ష 

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత బాబా సిద్దిఖీ హత్యకేసు నిందితుల్లో ఒకడైన ధర్మరాజ్ కశ్యప్ మైనర్ కాదని తేలింది. తాను మైనర్‌నని చెప్పడంతో ముంబై కోర్టు ఆదేశాల మేరకు అతడికి బోన్ అసిఫికేషన్ టెస్ట్ (ఎముకల పరిణామం తెలుసుకునే పరీక్ష) నిర్వహించారు. ఇందులో అతడు మైనర్ కాదని తేలింది. దీంతో అతడిని ఇతర నిందితులతో పాటు ఈ నెల 21 వరకు జుడీషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. 

మహారాష్ట్ర మాజీ మంత్రి, అజిత్ పవార్ వర్గం నేత అయిన సిద్దిఖీ శనివారం రాత్రి ఆయన కార్యాలయం బయట హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు షూటర్లతోపాటు సహ నిందితుడైన మరో వ్యక్తిని నిన్న అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ ముఠా ప్రకటించింది. పోలీసులు దీనిని కాంట్రాక్ట్ హత్యగా ధ్రువీకరించారు. షూటర్లలో ఒకడైన ధర్మరాజ్ కశ్యప్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడు కాగా, గుర్‌మైల్ బల్జీత్ సింగ్‌ది హర్యానా. 

వయసును పట్టించిన ఆధార్ కార్డు
నిందితులను కోర్టు ఎదుట ప్రవేశపెట్టగా కశ్యప్ తనకు 17 ఏళ్లని చెప్పాడు. అయితే, ఆధార్‌కార్డు ప్రకారం అతడు 2003లో జన్మించాడని, దీనిని బట్టి అతడి వయసు 21 సంవత్సరాలని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే కోర్టు అతడికి బోన్ అసిఫికేషన్ టెస్టు నిర్వహించాలని ఆదేశించింది. కాగా, ఈ కేసులో సోదరుడు శుభం లోంకర్‌తో కలిసి హత్య కుట్రలో భాగమైన పూణెకు చెందిన మూడో నిందితుడైన 28 ఏళ్ల వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. గుర్‌మైల్, కశ్యప్‌లతోపాటు ఉన్న మూడో షూటర్ శివకుమార్ అలియాస్ శివగౌతమ్ పరారీలో ఉన్నాడు. మరో నిందితుడిని మహ్మద్ జీషాన్ అక్తర్ (21)గా పోలీసులు గుర్తించారు.

Baba Siddique Murder Case
NCP
Mumbai
  • Loading...

More Telugu News