KTR: ఆ మరణాలు తెలంగాణ ప్రభుత్వ వైఫల్యమే: కేటీఆర్

KTR once again slams Revanth Reddy govt

  • సంగారెడ్డి జిల్లాలో కలుషిత నీటి కారణంగా మరణాలు!
  • మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలన్న కేటీఆర్
  • మిషన్ భగీరథ ప్రాజెక్టును సర్కారు సరిగా నిర్వహించలేకపోతోందని విమర్శలు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావు పేట గ్రామంలో కలుషిత నీరు తాగి ఇద్దరు మరణించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. సంజీవన్ రావు పేటలో కలుషిత నీటి సరఫరా వల్ల జరిగిన మరణాలు ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని ధ్వజమెత్తారు. 

మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, చికిత్స పొందుతున్న వారికి తగిన సాయం అందించాలని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మరెక్కడా ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. 

తెలంగాణ అంతటా తాగునీరు సరఫరా చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తి చేసిందని కేటీఆర్ వెల్లడించారు. కానీ... కృష్ణా, గోదావరి నదీ జలాలను శుద్ధి చేసి రాష్ట్రమంతా తాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టును రేవంత్ సర్కారు సరిగా నిర్వహించలేకపోతోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News