Bandaru Dattatreya: క్షమించండి... మీ అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరుకాలేను: సీపీఐ నారాయణ

CPI Narayana say sorry to Bandaru Dattatreya

  • రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా ఆహ్వానించినందుకు నారాయణ థ్యాంక్స్
  • ప్రొఫెసర్ సాయిబాబా విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్న నారాయణ
  • సాయిబాబా రాజకీయాలు తాను, తన పార్టీ అంగీకరించకపోవచ్చునని వ్యాఖ్య

"క్షమించండి... మీ అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరుకాలేను" అంటూ బండారు దత్తాత్రేయకు సీపీఐ నేత నారాయణ స్పష్టం చేశారు. దత్తాత్రేయ ప్రతి ఏడాది దసరా పండుగ సమయంలో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రముఖ నాయకులను అందరినీ ఆయన ఆహ్వానిస్తుంటారు. ఇందులో భాగంగా నారాయణకూ ఎప్పటిలాగే ఆహ్వానం పంపించారు.

అయితే తాను హాజరు కాలేనని నారాయణ తేల్చి చెప్పారు. రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం తనను అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. ఇందుకు దత్తాత్రేయకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అయితే ప్రొఫెసర్ సాయిబాబా 90 శాతం వికలాంగుడు అయినప్పటికీ ప్రభుత్వం అతనిని అరెస్ట్ చేసిందని, విచారణలో హక్కుగా ఉన్న బెయిల్ కూడా తిరస్కరించబడిందన్నారు. పదేళ్ల తర్వాత గౌరవ న్యాయస్థానం ఆయనను నిర్దోషిగా విడుదల చేసిందన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా రాజకీయాలను తాను, తన పార్టీ అంగీకరించకపోవచ్చు... కానీ అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్నారు. రాజ్యం అతనిని ఈ ప్రపంచం నుంచి దూరం చేసిందనడంలో సందేహం లేదన్నారు.

మీరు పెద్దవారు... కానీ మీరు అదే ప్రభుత్వానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారని దత్తాత్రేయను ఉద్దేశించి అన్నారు. అతని మరణానికి ఈ ప్రభుత్వం కారణమైందని ఆరోపిస్తూ, అందుకు నిరసనగా అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కావడంలేదని నారాయణ పేర్కన్నారు.

  • Loading...

More Telugu News