Baba Siddique: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ను కాల్చిచంపిన దుండగులు

Maharashtra former minister Baba Siddique shot dead in Mumbai

  • ముంబైలో శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో కాల్పులు
  • ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన సీనియర్ నేతగా ఉన్న బాబా సిద్ధిక్
  • మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పని చేసిన సీనియర్ నేత

ముంబైలో శనివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి చెందిన కీలక నేత బాబా సిద్ధిక్ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రాలో ఆయనను దుండగులు కాల్చిచంపారు. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో షూటర్లు ఆయనపైకి ఆరు బుల్లెట్లు కాల్చారు. బాబా సిద్ధిక్‌కు 4 బుల్లెట్లు తగిలాయి. అతడి సహాయకులలో ఒకరికి గాయాలయ్యాయి. కాగా తన కొడుకు, బాంద్రా ఈస్ట్ ఎమ్మెల్యే జీషాన్ కార్యాలయానికి సమీపంలోనే బాబా సిద్ధిక్‌పై కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన వెంటనే ఆయనను లీలావతి ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

బాబా సిద్ధిక్ బాంద్రా వెస్ట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 -2008 మధ్య రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు. 48 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హస్తం పార్టీని వీడి అజిత్ పవార్ ఎన్‌సీపీ వర్గంలో చేరారు. మరోవైపు ఆయన కొడుకు జీషాన్ సిద్ధిక్‌ను ఈ ఏడాది ఆగస్టులో పార్టీ నుంచి కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరించింది.

బాబా సిద్ధిక్ హత్యపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ‘‘ ఈ ఘటన చాలా దురదృష్టకరం. సిద్ధిక్ చనిపోయారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు, మరొకరు హర్యానాకు చెందినవారు. మరొకరు పరారీలో ఉన్నారు. ఈ ఘటన విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను నేను కోరాను. ముంబయిలో శాంతిభద్రతలను ఎవరూ వారి చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు’’ అని ఆయన అన్నారు.

మరోవైపు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమాచారం తెలిసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లారు. సిద్ధిక్ హత్య విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎక్స్ వేదికగా స్పందించారు. సహచరుడిని, స్నేహితుడిని కోల్పోయానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని నెలల ముందు నుంచే అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. బాబా సిద్ధిక్ హత్యపై రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News