Team India: బంగ్లాదేశ్ ను ఉతికారేసిన టీమిండియా... టీ20ల్లో రికార్డు స్కోరు

Team India batsmen hammers Bangladesh in Uppal clash

  • టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య 3వ టీ20 మ్యాచ్
  • పరుగుల వర్షంతో తడిసి ముద్దయిన ఉప్పల్ స్టేడియం
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 297 పరుగులు చేసిన టీమిండియా
  • టీ20ల్లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు
  • అంతర్జాతీయ టీ20ల్లో నేపాల్ తర్వాత రెండో అత్యధిక స్కోరు నమోదు

బంగ్లాదేశ్ తో చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు విధ్వంసకర ఇన్నింగ్స్ లతో కదం తొక్కారు. ఓపెనర్ సంజూ శాంసన్ 47 బంతుల్లోనే 111 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.... కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్సులు), రియాన్ పరాగ్ (13 బంతుల్లో 34; 1 ఫోర్, 4 సిక్సులు), హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సులు) దూకుడుగా ఆడారు. 

దాంతో టీమిండియా ఈ మ్యాచ్ లో 6 వికెట్లకు 297 పరుగులతో టీ20ల్లో రికార్డు స్కోరు నమోదు చేసింది. అంతర్జాతీయ టీ20 పోటీల్లో భారత్ కు ఇదే అత్యుత్తమ స్కోరు. 

అంతేకాదు, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లో రెండో అత్యధిక స్కోరు కూడా ఇదే. గతంలో నేపాల్ 314 పరుగులతో టీ20ల్లో టాప్ స్కోరర్ గా రికార్డు సృష్టించింది. ఇప్పుడు నేపాల్ తర్వాత 297 పరుగులతో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. 

ఇక, నేటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ బౌలర్లలో టాంజిమ్ హసన్ సకిబ్ 3 వికెట్లు, తస్కిన్ అహ్మద్ 1, ముస్తాఫిజూర్ రెహ్మాన్ 1, మహ్మదుల్లా 1 వికెట్ తీశారు. రింకూ సింగ్ ఇన్నింగ్స్ చివరి బంతిని సిక్స్ గా మలచడం విశేషం. 

రెండో టీ20లో విధ్వంసక బ్యాటింగ్ తో అలరించిన తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి నేడు డకౌట్ అయ్యాడు. చివర్లో భారీ షాట్ కొట్టబోయి, తానాడిన తొలి బంతికే వెనుదిరిగాడు.

More Telugu News