Brahmotsavams: చక్రస్నాన ఘట్టంతో తిరుమలలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

Tirumala Brahmotsavams ended with Chakrasnanam
  • అక్టోబరు 4న ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  • నేడు విజయదశమితో బ్రహ్మోత్సవాలకు ముగింపు
  • బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించామన్న టీటీడీ ఈవో
కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల దివ్యక్షేత్రంలో అక్టోబరు 4 నుంచి జరుగుతున్న శ్రీవేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. ఇవాళ విజయదశమి రోజున చక్రస్నాన ఘట్టంతో బ్రహ్మోత్సవాలకు తెరపడింది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో జె.శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. 

తిరుమల వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామని వెల్లడించారు. భక్తులకు సేవ చేయడం అంటే భగవంతుడికి సేవ చేయడమేనని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూశామని, ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకున్నామని ఈవో శ్యామలరావు చెప్పారు. 

టీటీడీ సిబ్బంది, విజిలెన్స్ అధికారులు, పోలీసులు, జిల్లా యంత్రాంగం ఎంతో సమన్వయంతో పనిచేసినట్టు తెలిపారు. తిరుమలలో వాహనాల రద్దీ తగ్గేలా నియంత్రణ చర్యలు చేపట్టామని వెల్లడించారు. 

ఈసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 26 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించామని, భక్తులకు పాలు, బాదం మిల్క్, మజ్జిగ, కాఫీ కూడా అందించామని, 4 లక్షల వాటర్ బాటిళ్లు అందించామని వివరించారు.

ఇక, అత్యంత ముఖ్యమైన గరుడ వాహన సేవ రోజున మూడున్నర లక్షల మంది భక్తులు తరలివచ్చారని ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఎవరికీ ఎలాంటి లోటు లేకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.
Brahmotsavams
Tiruamala
Chakrasnanam
TTD

More Telugu News