Vijayapal: రఘురామకృష్ణరాజు కేసులో విచారణకు హాజరైన రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయపాల్
- 2021లో రఘురామను అరెస్ట్ చేసిన సీఐడీ
- కస్టడీ పేరిట తనపై హత్యాయత్నం జరిగిందన్న రఘురామ
- గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు
- ఇటీవల విజయపాల్ కు ముందస్తు బెయిల్ నిరాకరించిన హైకోర్టు
- డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన విజయపాల్
గతంలో పోలీస్ కస్టడీ పేరిట తనపై హత్యాయత్నం జరిగిందని ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు షురూ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో నాటి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ ఒకరు.
ఇటీవలే ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు ఆయన పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో, రిటైర్డ్ సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్ నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. పశ్చిమ డీఎస్పీ కార్యాలయంలో ఆయనను పోలీసులు విచారిస్తున్నారు.
విజయపాల్ గత కొంతకాలంగా ఎక్కడున్నారన్నది తెలియరాలేదు. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా ఆయనకు చుక్కెదురైంది. విచారణకు హాజరుకావాల్సిందేనని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. దాంతో, తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వచ్చి, నేడు విచారణకు హాజరయ్యారు.
2021 మే 14న రఘురామను ఆయన పుట్టినరోజు నాడే సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆయనను హైదరాబాద్ నుంచి గుంటూరు సీబీసీఐడీ కార్యాలయానికి తరలించారు.
అయితే, తనను సీఐడీ కార్యాలయంలో రబ్బర్ బెల్టుతో, లాఠీతో కొట్టారని, తీవ్రంగా హింసించారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు, మాజీ సీఎం జగన్, అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్ లపై రఘురామ ఫిర్యాదు చేశారు.