Mahesh Kumar Goud: మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారనే ప్రచారంపై స్పందించిన పీసీసీ చీఫ్

PCC chief responds on Konda Surekha issue

  • సురేఖను తప్పిస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్న పీసీసీ చీఫ్
  • నాగార్జున, అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఆమె వెనక్కి తీసుకున్నారని వెల్లడి
  • కొండా సురేఖ అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్న మహేశ్ కుమార్ గౌడ్
  • ఫిరోజ్‌ఖాన్‌పై మజ్లిస్ దాడి అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామన్న పీసీసీ చీఫ్

నాగచైతన్య, సమంత, నాగార్జునపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే ప్రచారంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. రేవంత్ రెడ్డి కేబినెట్ నుంచి సురేఖను తప్పిస్తారని ప్రచారం సాగుతోందని, కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అక్కినేని నాగార్జున, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను సురేఖ వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. కాబట్టి ఆ వివాదం ఆ రోజే ముగిసిందని అన్నారు.

గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ అంశంపై అధిష్ఠానం కూడా వివరణ కోరలేదన్నారు. నాగార్జున కుటుంబంపై మంత్రి ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదన్నారు. కేటీఆర్ కారణంగానే సురేఖ అలాంటి మాటలు మాట్లాడవలసి వచ్చిందన్నారు. 

అయినప్పటికీ ఆమె అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. ఈ అంశంలో నాగార్జున కూడా కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. ఈ కేసు విచారణ అనంతరం కోర్టు ఏం చెబుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు.

ఫిరోజ్‌ఖాన్‌పై మజ్లిస్ దాడి ఘటనపై స్పందించిన పీసీసీ చీఫ్

కాంగ్రెస్ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్‌పై మజ్లిస్ దాడి ఘటనపై కూడా మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మజ్లిస్‌తో స్నేహం వేరు, శాంతిభద్రతలు వేరు అన్నారు. ఈ దాడి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. దాడుల విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఇతర పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయన్నారు.

దీపావళి లోపు రెండో విడత కార్పోరేషన్ పదవులు కేటాయిస్తామన్నారు. భవిష్యత్ తరాల కోసమే హైడ్రాను ఏర్పాటు చేశామని చెప్పారు. మూసీ అభివృద్ధికి రూ.1.50 లక్షల కోట్లు కేటాయించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అలా అని తాము ఎక్కడా ప్రకటన చేయలేదన్నారు. 

  • Loading...

More Telugu News