AP Wine Shops: ఏపీలో కొత్త మద్యం షాపులకు పోటెత్తుతున్న దరఖాస్తులు... అమెరికా, యూరప్ నుంచి కూడా రిజిస్ట్రేషన్లు!

Tender registrations for AP wine shops came from USA and Europe also

  • ఏపీలో మొత్తం 3,396 వైన్ షాపులకు దరఖాస్తుల స్వీకరణ
  • వైన్ షాపుల నోటిఫికేషన్ కు భారీ స్పందన
  • ఈ రాత్రి 7 గంటలకు ముగియనున్న దరఖాస్తు గడువు

ఏపీలో కొత్త మద్యం షాపులకు దరఖాస్తు గడువు ఈ రాత్రి 7 గంటలకు ముగియనుంది. ఈరోజు చివరి రోజు కావడంతో వైన్ షాపులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం షాపులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇవాళ చివరి రోజు కాగా... ఈరోజు మరో 20 వేల దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ప్రభుత్వ ఖజానాకు రూ. 1,600 కోట్లకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. 

మరోవైపు ఎన్టీఆర్ జిల్లాలో మద్యం షాపులకు అత్యధికంగా, అల్లూరి జిల్లాలో తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. నిన్న అర్ధరాత్రి వరకు ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 113 షాపులకు గాను 4,839 మంది దరఖాస్తు చేసుకున్నారు. అల్లూరి జిల్లాలో మొత్తం 40 వైన్ షాపులకు గాను 869 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అమెరికా, యూరప్ నుంచి కూడా 20 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. 

ఇంకోవైపు అబ్కారీ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ... ఆన్ లైన్లో దరఖాస్తు కోసం సాయంత్రం 7 గంటల వరకు అవకాశం ఉంటుందని... రిజిస్ట్రేషన్ తర్వాత రాత్రి 12 గంటల లోపు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. బ్యాంకు డీడీతో నేరుగా ఎక్సైజ్ స్టేషన్లకు వచ్చి దరఖాస్తు సమర్పించేవారు... సాయంత్రం 7 గంటల లోపు క్యూలైన్లలో ఉండాలని తెలిపారు. సంబంధిత పత్రాలతో 7 గంటల లోపు వచ్చిన వారికి టోకెన్లు అందించి, క్రమ పద్ధతిలో వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News