Rohit Sharma: రోహిత్ శర్మకు ఏమైంది?.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు బ్యాడ్‌న్యూస్

Captain Rohit Sharma is likely to miss the opening Test match against Australia later this year

  • వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల్లో ఒకదానికి రోహిత్ దూరమయ్యే అవకాశం
  • బీసీసీఐకి సమాచారం ఇచ్చిన కెప్టెన్
  • వ్యక్తిగత కారణమంటూ సమాచారం.. సమస్య పరిష్కారమైతే అన్ని టెస్టులు ఆడే ఛాన్స్

నవంబర్-డిసెంబర్ 2024లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ ట్రోఫీ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒకదానికి రోహిత్ అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రోహిత్ సమాచారం ఇచ్చాడని పేర్కొన్నాయి. 

‘‘ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మొదటి లేదా రెండవ మ్యాచ్‌కు రోహిత్ గైర్హాజరయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై పూర్తి స్పష్టత లేదు. రోహిత్ వ్యక్తిగత కారణంతో సిరీస్ ఆరంభ రెండు టెస్ట్ మ్యాచ్‌లలో ఒక దాంట్లో ఆడకపోవచ్చు. ఈ మేరకు బీసీసీఐకి అతడు సమాచారం ఇచ్చాడు. ఒకవేళ సిరీస్ ప్రారంభానికి ముందే వ్యక్తిగత సమస్య పరిష్కారమైతే రోహిత్ అన్ని టెస్టులు ఆడే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ అంశంపై మరింత క్లారిటీ వస్తుంది’’ అని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.

కాగా సిరీస్ ఆరంభంలో రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే భారత్ సన్నాహాలకు పెద్ద దెబ్బేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. న్యూజిలాండ్‌తో అక్టోబరు 22 నుంచి మొదలుకానున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సిరీస్ తర్వాత డిసెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా-భారత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడనున్నాయి.

నిజానికి స్వదేశంలో బంగ్లాదేశ్‌పై ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ పరుగులు రాబట్టేందుకు తెగ ఇబ్బందిపడ్డాడు. అయితే విదేశాల్లో మాత్రం రోహిత్ అత్యంత నమ్మదగిన బ్యాటర్‌. ప్రస్తుతం రోహిత్ స్థానంలో నమ్మకమైన ఓపెనర్ కూడా లేకపోవడంతో ఈ పరిణామం ఆందోళన కలిగించడం ఖాయంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే రుతురాజ్ గైక్వాడ్ లేదా అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News