Ratan Tata: ఆ రోజు రతన్ టాటా వస్తుంటే కోలాహలం నెలకొంది: ఆనంద్ మహీంద్రా
- పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత
- ఆయనతో పనిచేయడం తమకు దక్కిన గౌరవం అంటూ మహీంద్రా ట్వీట్
- రతన్ టాటా లేని లోటు భర్తీ చేయలేమని వెల్లడి
భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
"వ్యాపార రంగంలో రతన్ టాటా వంటి మహోన్నత వ్యక్తితో పనిచేయడం మా తరం వారికి దక్కిన అదృష్టం. ఇక ఆయనతో నా అత్యంత ఆనందాయక క్షణాలు అంటారా? దాదాపు 20 ఏళ్ల క్రితం ఢిల్లీలో నిర్వహించిన ఆటో ఎక్స్ పోలో ఇద్దరం కలిశాం.
ఆ సమయంలో నేను ఎక్స్ పోలో మా కంపెనీ పెవిలియన్ వద్ద ఉన్నాను. ఉన్నట్టుండి ఆ ఎక్స్ పో ప్రధాన ద్వారం వద్ద భారీ కోలాహలం నెలకొంది. ఎవరా అని చూస్తే... రతన్ టాటా! తన సహచరులను వెంటేసుకుని ఎవరూ ఊహించని విధంగా, ఉన్నట్టుండి ఎక్స్ పోలో ప్రత్యక్షమయ్యారు.
ఆయనను స్వాగతించడానికి వెళ్లినప్పుడు నవ్వుతూ పలకరించారు. పోటీ ఎలా ఉందో చూడ్డానికి వచ్చాను అని బదులిచ్చారు. ఏదేమైనా ఆయన లేని లోటు తీర్చలేనిది" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. అంతేకాదు, రతన్ టాటాతో కలిసున్న ఫొటోను కూడా పంచుకున్నారు.