Nara Lokesh: మహా దార్శనికుడు రతన్ టాటా: మంత్రి నారా లోకేశ్‌

Nara Lokesh Pay Tributes to Ratan Tata

  • ర‌త‌న్ టాటా మ‌ర‌ణం ప‌ట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం
  • ఆయ‌న సేవలు చిరస్మరణీయంగా నిలిచి పోతాయ‌న్న మంత్రి
  • ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జీవించే ఉంటార‌న్న లోకేశ్‌

వ్యాపార దిగ్గ‌జం ర‌త‌న్ టాటా మ‌ర‌ణం ప‌ట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా దార్శనికుడు రతన్ టాటా అని పేర్కొన్నారు. దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా టాటా గ్రూప్ సంస్థలను దశాబ్దాలుగా అదే నిబద్ధతతో నిర్వహించిన మ‌హోన్న‌త వ్య‌క్తి అని ప్ర‌శంసించారు. 

పద్మవిభూషణ్ రతన్ టాటా సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయ‌న్నారు. టాటా గ్రూప్ ఉత్పాదనలు వాడని భారతీయులు ఉండర‌ని లోకేశ్ తెలిపారు. మన దేశంలో ఏ మూల ఏ విపత్తు సంభవించిబా భారీ విరాళంతో స్పందించే గొప్ప‌ హృదయం క‌లిగిన వ్య‌క్తి రతన్ టాటా అని మంత్రి పేర్కొన్నారు. 

నిజాయతీని, నిస్వార్ధపరత్వాన్ని టాటా బ్రాండ్‌గా చేసిన రతన్ టాటా గారికి మరణం లేద‌న్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జీవించే ఉంటార‌ని చెప్పారు. నమ్మకమైన టాటా ఉత్పత్తుల రూపంలో ప్రతి ఇంట్లోనూ మనందరినీ ప్రతిరోజూ చిరునవ్వుతో పలకరిస్తూనే ఉంటార‌ని లోకేశ్ అన్నారు. రతన్ టాటా గారి నిరుపమానమైన సేవలను స్మరిస్తూ, మంత్రి నారా లోకేశ్‌ ఆయ‌న‌కు నివాళులు అర్పించారు.

కాగా, మరికాసేపట్లో మంత్రి నారా లోకేశ్ ముంబై వెళ్లనున్నారు. అక్క‌డికి వెళ్లి రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు.

More Telugu News