Ratan Tata: భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు.. రతన్ టాటాకు సినీ ప్ర‌ముఖుల నివాళులు

Celebrities Condolences to Ratan Tata

  • సేవలో ఆయ‌న‌ను మించిన‌వారు లేరన్న చిరు
  • ఆయ‌న‌ ఎప్పటికీ మ‌న హృద‌యాల్లో జీవించే ఉంటారన్న రాజమౌళి 
  • ర‌త‌న్ టాటాది బంగారంలాంటి హృద‌యమ‌న్న ఎన్‌టీఆర్‌

ప్ర‌ముఖ వ్యాపార దిగ్గ‌జం ర‌త‌న్ టాటా అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న మృతిప‌ట్ల ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా నివాళులు తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలో సినీ ప్ర‌ముఖులు కూడా ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా సంతాపం తెలియ‌జేస్తున్నారు. 

భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు: చిరంజీవి  
"భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు. సేవలో ఆయ‌న‌ను మించిన‌వారు లేరు. మన దేశం ఇప్పటివరకు చూసిన గొప్ప దార్శనికులలో ర‌త‌న్ టాటా ఒకరు. నిజమైన పారిశ్రామికవేత్త, పరోపకారి, అసాధారణమైన‌ వ్యక్తి. టాటా బ్రాండ్‌ల‌ను ప్రపంచ పవర్‌హౌస్‌గా నిర్మించడమే కాకుండా మన దేశ నిర్మాణంలోనూ అద్భుతంగా దోహదపడ్డారు. నిజంగా మెగా ఐకాన్. మ‌నం ఒక గొప్ప మ‌న‌సున్న మంచి వ్యక్తిని కోల్పోయాం. భారతీయ పారిశ్రామికవేత్తలలో ఆయన పెంపొందించిన విలువలు, సమగ్రత, దృక్పథం ఎల్లప్పుడూ తరాలకు స్ఫూర్తినిస్తాయి. మార్గనిర్దేశం చేస్తాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరుగాక!" అని చిరంజీవి ట్వీట్ చేశారు.  

ర‌త‌న్ టాటా ఓ లెజెండ్: రాజ‌మౌళి
"ర‌త‌న్ టాటా ఓ లెజెండ్. ఆయ‌న‌ ఎప్పటికీ మ‌న హృద‌యాల్లో జీవించే ఉంటారు. టాటా ఉత్పత్తుల‌ను ఉపయోగించకుండా ఒక రోజును ఊహించుకోవడం కష్టం. రతన్ టాటా వారసత్వం నిత్య జీవితంలో ఇమిడిపోయింది. ఎన్నో త‌రాల‌కు స్ఫూర్తి. పంచభూతాలతో పాటు ఎవరైనా కాలపరీక్షకు నిలబడతారంటే అది ఆయనే. 

భారతదేశం కోసం మీరు చేసిన ప్రతిదానికీ ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాం. లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితం చేసినందుకు ధన్యవాదాలు సర్. మీరు తరతరాలుగా నిలిచిపోయే గుర్తును మిగిల్చారు. నీకు వందనం... ఎల్లప్పుడూ మీ ఆరాధకుడు... జై హింద్" అంటూ రాజమౌళి త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు. 

ర‌త‌న్ టాటాది గోల్డెన్‌ హార్ట్: తార‌క్‌
"ర‌త‌న్ టాటాది బంగారంలాంటి హృద‌యం. ఆయ‌న‌ నిస్వార్థ దాతృత్వం, దూరదృష్టి గల నాయకత్వం లెక్కలేనన్ని జీవితాలను మార్చేశాయి. భారతదేశం ఆయ‌న‌కి ఎప్ప‌టికీ రుణపడి ఉంటుంది. ర‌త‌న్ టాటా ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తున్నా" అని ఎన్‌టీఆర్ ట్వీట్ చేశారు. 

లక్షలాది మందికి ఆశాజ్యోతి: ఖుష్బూ 
"ఒక పరోపకారి. స్వచ్ఛమైన బంగారు హృదయం ఉన్న వ్యక్తి. లక్షలాది మందికి ఆశాజ్యోతి. నిరుపేదలకు వెలుగునిచ్చేందుకు ఎంతో కృషి చేసిన గొప్ప‌ వ్యక్తి. అలాంటి గొప్ప వ్య‌క్తి మ‌రొక‌రు ఉండ‌రు. మీరు మమ్మల్ని విడిచిపెట్టిన ఈ రోజు ప్రపంచం కన్నీళ్లు పెట్టుకుంటుంది. మిస్ యూ సార్. ఓం శాంతి" అని న‌టి ఖుష్బూ సుందర్ ట్వీట్ చేశారు. 

భార‌త‌ జాతికి పెద్ద నష్టం: రామ్‌చ‌ర‌ణ్‌
"పారిశ్రామిక దిగ్గ‌జం ర‌త‌న్ టాటా మ‌ర‌ణం భార‌త‌ జాతికి పెద్ద నష్టం. ఆయ‌నో ఐకానిక్ లెజెండ్. సామాన్యుడి నుండి వ్యాపార మార్గదర్శకుల వరకు చాలా మంది జీవితాలను ప్ర‌భావితం చేశారు. గాఢంగా ప్రేమించే పరోపకారి. రతన్ టాటా సర్ వారసత్వం లక్షలాది మంది హృదయాల్లో నిలిచి ఉంటుంది" అని రామ్‌చ‌ర‌ణ్‌ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News