Chandrababu: హర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి గెలవడంపై స్పందించిన చంద్రబాబు

Chandrababu responds on BJP winning in Haryana

  • సుపరిపాలన లాభాలను ప్రజలు చూసినందువల్లే బీజేపీకి ఓటేశారన్న సీఎం
  • అగ్రనాయకత్వం పని చేసే విధానం వల్ల హర్యానాలో గెలిచిందని వ్యాఖ్య
  • ఎన్డీయే విజయం శుభసూచకమన్న చంద్రబాబు

హర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి గెలుపొందడంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సుపరిపాలన వల్ల వచ్చే లాభాలను ప్రజలు చూశారు కనుకే ఆ రాష్ట్ర ప్రజలు కమలం పార్టీకి మూడోసారి అధికారం ఇచ్చారని వ్యాఖ్యానించారు. బీజేపీ అగ్రనాయకత్వం పని చేసే విధానం వల్ల హర్యానాలో గెలిచారని పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో బీజేపీ హ్యాట్రిక్ సాధించడం ఎన్డీయే కూటమికి శుభసూచకమన్నారు.

ప్రజలు ప్రధాని మోదీపై నమ్మకం ఉంచారని తెలిపారు. అందుకే సుస్థిరత, అభివృద్ధికి అక్కడి ప్రజలు ఓటు వేశారన్నారు. జమ్మూకశ్మీర్‌లో కూడా బీజేపీ బలమైన పార్టీగా ఎదిగిందని తెలిపారు. బీజేపీకి ఇక్కడ ఓటింగ్ శాతం భారీగా పెరిగిందన్నారు. మంచి పనులు చేసే వారిని ప్రజలు ఎక్కడైనా ఆదరిస్తారన్నారు. రానున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీయేకు మంచి ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

జమిలికి చంద్రబాబు మద్దతు

జమిలి ఎన్నికలకు దేశమంతా మద్దతు తెలపాల్సిన ఆవశ్యకత ఉందని చంద్రబాబు అన్నారు. సుస్థిర పాలన ఉంటేనే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఏదో ఒక రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. పార్లమెంట్, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తే ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి సారించడానికి అవకాశం ఉంటుందన్నారు.

  • Loading...

More Telugu News