Konda Vishweshwar Reddy: రాహుల్ గాంధీ ప్రజల మధ్య చిచ్చుపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు: బీజేపీ ఎంపీ

BJP MP Konda Vishweshwar Reddy blames Rahul Gandhi

  • మహారాష్ట్ర, జార్ఖండ్‌లలోనూ బీజేపీ గెలుస్తుందని ధీమా
  • దేశం సుభిక్షంగా ఉండాలంటే ప్రజలు బీజేపీకి అండగా నిలవాలని వ్యాఖ్య
  • మైనార్టీలను కాంగ్రెస్ వాడుకుంటే, మోదీ ప్రభుత్వం అండగా నిలిచిందన్న విశ్వేశ్వర్ రెడ్డి

రాహుల్ గాంధీ ప్రజల మధ్య చిచ్చుపెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. హర్యానా ప్రజలు బీజేపీని గెలిపించి అద్భుతమైన తీర్పు ఇచ్చారన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలో జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం ఖాయమన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని ఆర్కేపురం డివిజన్‌లో స్థానిక కార్పొరేటర్ రాధాధీరజ్ రెడ్డితో కలిసి ఆయన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశం సుభిక్షంగా ఉండాలన్నా... అభివృద్ధి పథం వైపు నడవాలన్నా ప్రజలు బీజేపీకి అండగా నిలవాలన్నారు. దేశం మీద ప్రేమ ఉన్నవారు బీజేపీ తప్ప ఇతర పార్టీల వైపు చూడరని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను వాడుకుందని ఆరోపించారు. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం వారికి అండగా నిలిచిందన్నారు.

వేర్పాటువాదులతో పొత్తు పెట్టుకునే కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీకి దేశం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన నేషనల్ కాన్ఫరెన్స్‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నదన్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తుందో చెప్పాలని నిలదీశారు.

Konda Vishweshwar Reddy
BJP
Rahul Gandhi
Congress
  • Loading...

More Telugu News