Katipalli Venkataramana Reddy: అవి అబద్ధమని నిరూపిస్తే సూసైడ్ చేసుకొని చనిపోవడానికి సిద్ధం: కాటిపల్లి వెంకటరమణారెడ్డి

Katipalli Venkata Ramana Reddy challenges Government

  • ప్రజలు ఇళ్లు నిర్మించుకోవడానికి బ్యాంకులు లోన్లు ఇచ్చాయన్న బీజేపీ ఎమ్మెల్యే
  • భూములు ఆక్రమించిన బడాబాబులు, కంపెనీల పేర్లు త్వరలో బయటపెడతానని వెల్లడి
  • హైడ్రా కూల్చివేతల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేలాదిమంది ప్రజలు ఇళ్లను నిర్మించుకోవడానికి వివిధ బ్యాంకులు లోన్లు ఇచ్చాయని, అవి అవాస్తవమని నిరూపిస్తే తాను సూసైడ్ చేసుకొని చనిపోవడానికి సిద్ధమని కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ నేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ చేశారు. నగరంలో భూములు ఆక్రమించిన బడాబాబులతో పాటు 30 కంపెనీలకు సంబంధించిన వివరాలను తాను త్వరలో బయటపెడతానన్నారు.

మూసీ ప్రక్షాళనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆక్రమణలను తొలగించకుంటే రానున్న రోజుల్లో ప్రజలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే స్పందించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్షల కోట్ల విలువ చేసే అనేక స్థలాలు కబ్జాకు గురయ్యాయన్నారు. వీటిలో కంపెనీలు ఏర్పాటు చేసుకోవడానికి విదేశీయులకు ప్రస్తుత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలో పలు కంపెనీలతో పాటు బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న వాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈసీ సర్టిఫికెట్స్ కూడా జారీ చేసిందని వెల్లడించారు. కానీ ఇప్పుడు హైడ్రా కూల్చివేతల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని విమర్శించారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కేవలం మధ్య తరగతి వారిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు చెందిన 119 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తమ వేతనాలను హైడ్రా కూల్చివేతలతో నష్టపోయిన బాధితులకు ఇచ్చేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. తన పది నెలల ఎమ్మెల్యే వేతనం రూ. 20 లక్షలు ఇచ్చేందుకు తాను సిద్ధమని, మిగతా ప్రజాప్రతినిధులు రెడీగా ఉన్నారా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News