Pawan Kalyan: 14 నుంచి గ్రామాల్లో పల్లె పండుగ వారోత్సవాలు: పవన్

deputy cm pawan kalyan meeting with collectors and govt officials over palle panduga program

  • గ్రామ సభల్లో తీర్మానించిన 30 వేల పనులకు శ్రీకారం 
  • రూ.4,500 కోట్ల పనులకు భూమిపూజ
  • 3 వేల కి.మీ. సీసీ రోడ్లు, 500 కి.మీ. తారు రోడ్ల పనులు

గ్రామాల్లో అభివృద్ధి పనులు శరవేగంగా మొదలుపెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించి పనులు మొదలుపెట్టాలని కలెక్టర్లు, అధికారులకు సూచించారు. ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో విప్లవాత్మక రీతిలో నిర్వహించిన గ్రామ సభల్లో ఆమోదించిన పనులను పల్లె పండుగ సందర్భంగా ప్రారంభించాలని ఆదేశించారు.

మంగళవారం సచివాలయం నుంచి ఆయన కలెక్టర్లు, జిల్లా అధికారులు, జిల్లా పరిషత్ అధికారులు, ముఖ్య కార్య నిర్వహణ అధికారులు, డీపీవోలు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ, ఇతర జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజులపాటు ‘పల్లె పండుగ’ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గ్రామసభల్లో తీసుకున్న అర్జీల పరిష్కారానికి, తీర్మానాలు అమలు చేసేందుకు, దాదాపు 4,500 కోట్ల వ్యయంతో 30 వేల పనులను మొదలుపెట్టేందుకు ఈ పల్లె పండుగ కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలిపారు. 

గ్రామాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ ఆదేశించారు. ముఖ్యంగా 3 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు లాంటి పనులు చేపట్టాలన్నారు. వారోత్సవాల్లో ప్రారంభించిన పనులతో పాటు ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు సంక్రాంతిలోగా పూర్తి చేసి మళ్లీ సంబరాలు చేసుకోవాలని సూచించారు. పనుల వివరాలు ప్రజలందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ పల్లె పండుగ కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని పవన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News