North Korea: ఉత్తర కొరియా మిలటరీ కీలక ప్రకటన

North Korea to cut off roads and railways connected to South Korea

  • దక్షిణకొరియాను కలిపే అన్ని రోడ్లు, రైల్వే మార్గాలను తొలగిస్తామని ప్రకటన
  • బుధవారం నుంచే రవాణా నిలిపివేత
  • సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన రక్షణ నిర్మాణాలు చేపడతామని వెల్లడి

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఉప్పు-నిప్పులా ఉంటున్నప్పటికీ ఈ రెండు దేశాలను అనుసంధానించే కొన్ని రహదారులు, రైలు మార్గాలు ఉన్నాయి. వీటన్నిటినీ తొలగించనున్నట్టు ఉత్తర కొరియా మిలటరీ బుధవారం ప్రకటించింది. దక్షిణ కొరియాతో అనుసంధానమైన అన్ని మార్గాలను బుధవారం నుంచి నిలిపివేస్తున్నట్టు తెలిపింది. సరిహద్దులో తమవైపు ప్రాంతాలను పటిష్టమైన రక్షణ నిర్మాణాలతో బలోపేతం చేయనున్నట్టు వెల్లడించింది. అక్టోబర్ 9న (బుధవారం) తొలుత ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్టు ఉత్తర కొరియా పీపుల్స్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ఒక ప్రకటనలో పేర్కొన్నట్టు ‘కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ’ తెలిపింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చిందని పేర్కొంది.

దక్షిణ కొరియా వైపు చెత్తతో నింపిన బెలూన్లను ఉత్తరకొరియా పంపిస్తుండటం, సుసంపన్నమైన యురేనియం సౌకర్యం తమ వద్ద ఉందంటూ ఉత్తర కొరియా మొదటిసారి బహిరంగంగా ప్రకటించడం ఇరుదేశాల మధ్య తాజా ఉద్రిక్తతలకు కారణమని ‘యోన్‌హాప్’ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.

మరోవైపు రాజ్యాంగాన్ని సవరించాలని ఉత్తర కొరియా నిర్ణయించింది. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ సెషన్‌లో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ అధికారిక మీడియా బుధవారం ప్రకటించింది. దేశ సోషలిస్టు రాజ్యాంగంలోని కొన్ని భాగాలను సవరించి, అనుబంధంగా చేర్చాలని నిర్ణయించినట్టు తెలిపింది. అయితే, సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాలకు అనుగుణంగా సరిహద్దులను ఏమైనా మార్చారా అనే వివరాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News