Chandrababu: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబు చమత్కారం.. పగలబడి నవ్విన మోదీ!
- చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర ఘటన
- లడ్డూ ప్రసాదాన్ని మోదీకి అందజేసి.. అందులో కల్తీలేదన్న చంద్రబాబు
- ఒక్కసారిగా విరగబడి నవ్విన ప్రధాని మోదీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారంటూ ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ కావడం ఎంతటి దుమారాన్ని రేపిందో తెలిసిందే. ఈ విషయం తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తజనం విస్మయం చెందగా.. హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ అంశం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రాజేసింది. ప్రస్తుతం ఈ వివాదంపై విచారణ కొనసాగుతోంది. ఈ లడ్డూ ప్రసాదం విషయమై సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
తన పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మోదీ వద్ద చంద్రబాబు సరదాగా చేసిన వ్యాఖ్యలు నవ్వుల పువ్వులు పూయించాయి. ఈ లడ్డూలో కల్తీ లేదని, వందకు వందశాతం పవిత్రమైనదని, స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేశామని చంద్రబాబు అనడంతో మోదీ నవ్వు అందుకున్నారు. బాబు చమత్కారానికి మోదీ విరగబడి నవ్వారు.
మరోవైపు విశిష్ట గుర్తింపు పొందిన అరకు కాఫీ బ్రాండ్‌కు మరింత ప్రాచుర్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ కాఫీ పౌడర్ బాక్స్‌ను ప్రధాని మోదీకి చంద్రబాబు తన పర్యటనలో అందజేశారని తెలిసింది. అరకు కాఫీ అంటే తనకు చాలా ఇష్టమంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవలే ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. 2016లో విశాఖపట్నంలో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు, ఇతరులతో కలిసి కాఫీ తాగిన ఫొటోలను ఆయన షేర్ చేసిన విషయం తెలిసిందే.