Assembly Elections: హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్... జమ్మూ కశ్మీర్ లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయం

BJP wins Haryana and NC alliance clinched Jammu and Kashmir

  • ముగిసిన రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు
  • హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ జయకేతనం
  • జమ్మూ కశ్మీర్ లో బీజేపీకి ఆశాభంగం 

హర్యానా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించగా... జమ్మూ కశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి గెలుపొందింది. 

హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా రాగా... నేడు ఓట్ల లెక్కింపు ట్రెండ్స్ పూర్తి విరుద్ధంగా వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తల్లకిందులు చేస్తూ బీజేపీ వరుసగా మూడోసారి హర్యానా పీఠం చేజిక్కించుకుంది. మొత్తం 90 స్థానాలకు గాను కమలం 48 స్థానాల్లో వికసించింది. 

హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ 46 కాగా... బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది. 37 స్థానాలకు మాత్రమే పరిమితమైన కాంగ్రెస్ మరోసారి విపక్ష హోదాతో సరిపెట్టుకుంది. ఐఎన్ఎల్ డీ 2, ఇతరులు 3 స్థానాలు దక్కించుకున్నారు. అటు, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. 

మరోవైపు, జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో నెగ్గి ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం సబబేనని నిరూపించుకోవాలని భావించిన బీజేపీకి ఆశాభంగం కలిగింది. జమ్మూ కశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. 

నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి 48 చోట్ల నెగ్గింది. ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్ 42, కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలిచాయి. అయితే, బీజేపీ సొంతంగా 29 స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం. పీడీపీ 3, జేపీసీ 1, సీపీఐ (ఎం) 1, ఆప్ 1, ఇతరులు 7 స్థానాలు దక్కించుకున్నారు.

  • Loading...

More Telugu News