Chandrababu: ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu press meet after Delhu tour conclusion

  • ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన
  • రెండ్రోజుల పాటు సాగిన పర్యటన
  • ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీ

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. అనంతరం, ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించానని చంద్రబాబు వెల్లడించారు. 

గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం గురించి, రాష్ట్రం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందో వివరించానని, అదే సమయంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఇవే అంశాలను ఆయనకు గతంలోనే చెప్పానని, తాజాగా మరోసారి వివరించానని తెలిపారు. 

కేంద్రం పథకాలను ఉపయోగించుకోకపోవడం, కేంద్రం పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ లు విడుదల చేయకపోవడం, కేంద్రం ఇచ్చిన నిధులను వేరే ప్రయోజనాల కోసం మళ్లించడం వంటి గత ప్రభుత్వ చర్యలను ప్రధానికి తెలియజేశానని చంద్రబాబు పేర్కొన్నారు. 

పోలవరం ప్రాజెక్టుకు తొలి దశ కింద రూ.12,500 కోట్లను క్లియర్ చేసినందుకు, కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఆమోదం తెలిపినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశాను అని వెల్లడించారు. అమరావతికి తొలి దశ కింద రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు ముందుకొచ్చిందని, వచ్చే డిసెంబరు నుంచి అన్ని పనులు ప్రారంభమవుతాయని అన్నారు. 

రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని ఎక్కడిక్కడ సరిదిద్దుకుంటూనే, స్వర్ణాంధ్రప్రదేశ్-2047 విజన్ డాక్యుమెంట్ తయారుచేస్తున్నాం అని ప్రధాని మోదీకి వివరించానని తెలిపారు. రాష్ట్రంలో నిర్మించాల్సిన జాతీయ రహదారుల జాబితాను కూడా ప్రధానికి అందించానని, వాటిని సకాలంలో పూర్తి చేయాలని కోరానని వెల్లడించారు. 

ఇంకా పలు అంశాలపై ప్రధాని మోదీకి స్పష్టత ఇచ్చానని చంద్రబాబు పేర్కొన్నారు. చాలావరకు ప్రధాని సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇదే సహకారం భవిష్యత్తులోనూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారని, వారికి ధన్యవాదాలు తెలియజేశానని వివరించారు. 

ప్రధానితో సమావేశం తర్వాత కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిశానని, ఆయనతో పలు విషయాలు కూలంకషంగా చర్చించానని చంద్రబాబు వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్ అంశాన్ని ఆయనతో చర్చించానని, గత ప్రభుత్వం భూమి ఇవ్వలేకపోయిన విషయాన్ని, తాము అధికారంలోకి వచ్చాక భూమి కేటీయించిన అంశాన్ని ప్రస్తావించానని తెలిపారు. 

ఇక, ఇతర కేంద్ర మంత్రులు కూడా తమ పరిధిలో ఏపీ ప్రయోజనాల పట్ల సానుకూలంగా స్పందించారని చంద్రబాబు వివరించారు.

More Telugu News