Jani Master: జానీ మాస్టర్ కు అవార్డు రద్దు చేయడంపై కర్ణాటక ప్రభుత్వం స్పందన

Karnataka Govt reacts on Centre revokes award for Jani Master

  • జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు
  • పోక్సో చట్టం కింద కేసు
  • ఇటీవల అవార్డు ఉపసంహరించుకున్న కేంద్రం
  • స్వాగతిస్తున్నట్టు తెలిపిన కర్ణాటక మంత్రి దినేశ్ గుండూరావు

ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కేంద్ర ప్రభుత్వం అవార్డును రద్దు చేయడంపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. జానీ మాస్టర్ కు అవార్డు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. 

జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద ఆరోపణలు వచ్చాయని,  దాంతో కేంద్ర ప్రభుత్వం జానీ మాస్టర్ కు అవార్డు నిరాకరించిందని, ఈ నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు. 

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని దినేశ్ గుండూరావు స్పష్టం చేశారు. ఇలాంటి నేరగాళ్లపై సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థల్లో, వ్యాపారాల్లో, పరిశ్రమల్లో మహిళల పాత్ర పెరుగుతోందని... మహిళల పట్ల వేధింపులు లేని వాతావరణం కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని దినేశ్ గుండూరావు వివరించారు. 

జాని మాస్టర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షణీయమేనని, అయితే న్యాయం అందరికీ ఒకటే విధంగా వర్తింపజేయాలని హితవు పలికారు. మాజీ సీఎం బీఎస్ యెడియూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైందని, సీఐడీ చార్జ్ షీట్ కూడా దాఖలు చేసిందని, కానీ ఇంతవరకు విచారణ ప్రారంభం కాలేదని దినేశ్ గుండూరావు విమర్శించారు. ఇది బీజేపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News