Manohar Lal Khattar: ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించారు: మనోహర్ లాల్ ఖట్టర్
- రాష్ట్రానికి ఎంతో చేసిన బీజేపీకి ప్రజలు హ్యాట్రిక్ ఇచ్చారన్న ఖట్టర్
- మోదీ పాలసీలు హర్యానా ప్రజలపై సానుకూల ప్రభావాన్ని చూపాయని వ్యాఖ్య
- కాబోయే సీఎం ఎవరనే విషయాన్ని పార్లమెంటరీ బోర్డు చూసుకుంటుందన్న ఖట్టర్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దాదాపు ఖరారయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 46 కాగా... బీజేపీ 50 స్థానాలను గెలుచుకునే దిశగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, హర్యానా మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీని హర్యానా ప్రజలు తిరస్కరించారని చెప్పారు. గత పదేళ్లుగా హర్యానా ప్రజలకు ఎంతో చేసిన బీజేపీకి హ్యాట్రిక్ విజయం కట్టబెట్టారని అన్నారు.
ప్రధాని మోదీ పాలసీలు హర్యానా ప్రజలపై ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపాయనే మెసేజ్ ను ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయని ఖట్టర్ చెప్పారు. హర్యానా ప్రజలు తెలివైనవారని, పరిణతి ఉన్నవారని కితాబిచ్చారు.
నయబ్ సింగ్ సైనీని మళ్లీ సీఎం చేస్తారా? అనే ప్రశ్నకు బదులుగా... దీనిపై పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని... ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టంగా చెప్పారని ఖట్టర్ తెలిపారు. మరోవైపు, ఈ ఏడాది మార్చి వరకు హర్యానా సీఎంగా ఖట్టర్ ఉన్నారు. ఖట్టర్ స్థానంలో నయబ్ ను ముఖ్యమంత్రిగా చేసిన బీజేపీ అధిష్ఠానం... ఖట్టర్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంది.