Bannerghatta National Park: బెంగళూరులో సఫారీ బస్సులోకి తొంగిచూసిన చిరుత.. హడలిపోయిన సందర్శకులు.. వీడియో ఇదిగో!

Viral Video of Leopard Leaping At Safari Bus At Bannerghatta National Park

  • బన్నెర్‌ఘట్ట నేషనల్ పార్క్‌లో ఘటన
  • వన్యప్రాణులను మరింత స్పష్టంగా చూపించే ఉద్దేశంతో వాటి దగ్గరగా తీసుకెళ్లిన డ్రైవర్
  • సఫారీ వాహనంపైకి ఎక్కేందుకు చిరుత ప్రయత్నం

బెంగళూరు సమీపంలోని బన్నెర్‌ఘట్ట నేషనల్ పార్క్‌‌ సఫారీలో ఓ చిరుత సందర్శకులను బెంబేలెత్తించింది. వారు ప్రయాణిస్తున్న బస్సు వద్దకు వచ్చిన చిరుత అమాంతం కిటికీలో తలపెట్టి లోపలికి తొంగిచూసింది. దీంతో లోపలున్నవారు హడలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కిటికీ తెరిచి ఉండడం, కాళ్లు బస్సుపై వేసి నిలబడి లోపలికి తొంగి చూడడంతో ఏం జరుగుతుందో తెలియక పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ తర్వాత కూడా బస్సుపై దాడికి చిరుత ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ నెమ్మదిగా బస్సును ముందుకు కదిలించడంతో చిరుత తన గుహలోకి వెళ్లిపోయింది. 

ఆదివారం ఈ ఘటన జరిగినట్టు పార్క్ అధికారులు తెలిపారు. వన్యప్రాణులను మరింత స్పష్టంగా చూసేందుకు సఫారీ డ్రైవర్ వాహనాన్ని దగ్గరగా తీసుకెళ్లడంతో ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. అయితే, అనుకోకుండా చిరుత బస్సు వద్దకు రావడంతో సందర్శకులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ టూరిస్ట్ ఈ ఘటనను తన కెమెరాలో బంధించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

More Telugu News