vakati narayana reddy: సెల్ఫ్‌ కస్టడీ పేరిట మాజీ ఎమ్మెల్సీ వాకాటికి 6 రోజులు నరకం చూపించిన సైబర్ కేటుగాళ్లు!

Cyber Attackars Targets BJP Leader Vakati Narayana Reddy and Harassed him for One Week

  • ముంబై సీబీఐ ఆఫీస్ సెటప్ వేసి నమ్మించిన వైనం
  • రూ.15 కోట్లు గుంజేందుకు ప్రయత్నించిన మోసగాళ్లు
  • ఆరు రోజుల తర్వాత అసలు విషయాన్ని గుర్తించిన బీజేపీ నేత వాకాటి నారాయణ రెడ్డి

ఆర్థిక మోసాలకు పాల్పడడమే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాల్లో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ మధ్య సుప్రీంకోర్ట్ సెటప్ వేసి మరీ డిజిటల్ అరెస్ట్ పేరిట వర్ధమాన్‌ గ్రూపు ఎండీని దాదాపు రూ.7 కోట్ల మేర ముంచారు. ఈ తరహా మోసం ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో కూడా తాజాగా వెలుగుచూసింది. మాజీ ఎమ్మెల్సీ, నెల్లూరు బీజేపీ నాయకుడు వాకాటి నారాయణరెడ్డిని దోచేందుకు కేటుగాళ్లు ప్రయత్నించారు.  దాదాపు రూ.15 కోట్ల మేర మోసగించేందుకు ప్రయత్నం జరగగా చివరి నిమిషంలో ఆయన గమనించి బయటపడ్డారు. సెల్ఫ్ అరెస్ట్ పేరిట దాదాపు వారం రోజులపాటు ఆయనకు నరకం చూపించారు. ఆరున్నర రోజులపాటు వాట్సప్ కాల్‌లో లైవ్‌లోనే ఉంచారు. ఎక్కడికి వెళ్లినా వాట్సప్‌ కాల్‌లోనే ఉండాలంటూ చుక్కలు చూపించారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 27న వాకాటి నారాయణ రెడ్డికి ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. ఫెడెక్స్‌ పార్సిల్‌ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని నమ్మించారు. థాయ్‌లాండ్‌లో ఉంటున్న జాన్జ్‌లిన్‌ అనే వ్యక్తికి ఒక పార్సిల్ పంపించారు కదా అని అడిగాడు. తాను పార్సిల్ పంపించలేదని వాకాటి సమాధానం ఇవ్వగా.. అయితే ‘ఎవరో మీ ఆధార్‌ను దుర్వినియోగం చేశారు’ అని కేటుగాడు నమ్మించాడు. పార్సిల్‌లో 200 గ్రాముల డ్రగ్స్, 6000 అమెరికన్ డాలర్లు, పాస్‌పోర్టు, బ్యాంక్‌ కార్డులు, దుస్తులు, లాప్‌ట్యాప్‌ ఉన్నాయని చెప్పారు. పార్సిల్‌ పంపలేదంటున్నారు కాబట్టి ముంబై సీబీఐ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేయాలని కేటగాడు సూచించాడు. ఇక్కడి నుంచి అసలు నాటకం మొదలైంది.

సీబీఐ ఆఫీస్ సెటప్..
వాకాటి కాల్‌ను ముంబైలో అప్పటికే సెటప్ వేసి ఉంచిన ఫేక్ సీబీఐ కార్యాలయానికి మోసగాళ్లు కనెక్ట్ చేశారు. నిజమైన సీబీఐ కార్యాలయం అని నమ్మిన వాకాటి పార్సిల్‌కు సంబంధించి వాళ్లు చెప్పిన విషయాలనే ఫిర్యాదు చేశారు. రవీంద్ర పేరుతో అధికారిగా నమ్మించిన ఓ కేటుగాడు ఫిర్యాదు నమోదు చేస్తున్నట్టు నమ్మించాడు. వాట్సప్‌ కాల్‌ లో ఫిర్యాదు చేయాలని చెప్పడంతో వాకాటి వాట్సప్ కాల్ చేశారు. అప్పటి నుంచి దాదాపు వారంపాటు నరకం చూపించారు. తొలుత వీడియోకాల్‌లో ఆధార్‌ కార్డు చూపించాలని కోరారు. చూపించిన కొన్ని నిమిషాల తర్వాత మీ మీద మనీ ల్యాండరింగ్‌ కేసులు, సీబీఐ కేసులు ఉన్నాయని కేటుగాళ్లు చెప్పారు. అవి తమ వ్యాపారానికి సంబంధించిన కేసులని వాకాటి చెప్పగా.. తాము పరిశీలిస్తామని, సెల్ఫ్‌ కస్టడీలో ఉండాలని వాకాటిని ఆదేశించారు. ఫోన్ కాల్ కట్‌ చేయవద్దని, ఎక్కడికి వెళ్లినా వాట్సప్‌ కా‌ల్‌లోనే ఉండాలని చెప్పారు. నిజమేనని నమ్మిన ఆయన కాల్‌లోనే ఉన్నారు.

సెప్టెంబర్ 27వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఈనెల 3వ తేదీ వరకు ఆరున్నర రోజుల పాటు ఆయనను వాట్సప్‌ కాల్‌లోనే ఉంచారు. సుమారు 156 గంటలపాటు ఆ సీనియర్‌ నేతకు నరకం చూపించారు. అయితే 3న గౌడ అనే పేరుతో సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్న కేటుగాడు బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్‌ అయ్యాయని చూపించాడు. కొన్ని నిమిషాల తర్వాత డీఎస్పీని అంటూ పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి రూ.15 కోట్లు చెల్లిస్తే మ్యాటర్ సెటిల్‌మెంట్ చేస్తానని అనడంతో వాకాటికి అనుమానం వచ్చింది. డబ్బులు లేవని ఆయన చెప్పడంతో కేటుగాళ్లు దుర్భాషలాడడం మొదలుపెట్టారు. దీంతో నిన్న (సోమవారం) నెల్లూరు పోలీస్‌ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు.

More Telugu News