Karnataka: అదృశ్యమైన కోటీశ్వరుడు శవమై తేలాడు!
- కర్ణాటకలో కలకలం రేపిన ప్రముఖ వ్యాపారి, మిస్బా గ్రూప్ విద్యాసంస్థల అధినేత బీఎం ముంతాజ్ అలీ అదృశ్యం కేసు
- 12 గంటల గాలింపు చర్యల అనంతరం ఫాల్గుణి నది ముఖ ద్వారం వద్ద అలీ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
- అలీ మృతికి కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందన్న మంగళూరు పోలీస్ కమిషనర్
కర్ణాటకలో ఆదివారం అదృశ్యమైన ప్రముఖ వ్యాపారవేత్త, మిస్బా గ్రూప్ విద్యాసంస్థల అధినేత బీఎం ముంతాజ్ అలీ (52) వ్యవహారం విషాదంగా ముగిసింది. దాదాపు గంటల పాటు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, ఆయన మృతదేహాన్ని ఫాల్గుణి నది ముఖ ద్వారం వద్ద గుర్తించారు. వివరాల్లోకి వెళితే .. అలీ ఆదివారం వేకువ జామున 3 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అలీ చివరి మాటలతో అప్రమత్తమైన అతని కుమార్తె పోలీసులకు సమాచారం ఇచ్చింది.
దీంతో కావూరు పోలీస్ స్టేషన్‌లో ఆయన అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అలీని డబ్బుల కోసం బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేసిన ఆరోపణలపై ఓ మహిళతో పాటు అరుగురిని నిందితులుగా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అదృశ్యమైన అలీ ప్రముఖ వ్యాపారి కావడంతో పాటు మంగళూరు మాజీ ఎమ్మెల్యే మెయిదీన్‌కు సమీప బంధువు కావడంతో కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని అలీ ఆచూకీ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కల్లూరు వంతెన సమీపంలో ధ్వంసమైన అతని కారును పోలీసులు గుర్తించారు. తర్వాత ఫాల్గుణి నది ముఖ ద్వారం వద్ద అతని మృతదేహాన్ని కనుగొన్నారు. అలీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏజే ఆసుపత్రికి తరలించినట్లు మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు. ఆయన మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతుందని ఆయన చెప్పారు.