Stock Market: స్టాక్ మార్కెట్ విలవిల... ఒక్కరోజులో రూ.9 లక్షల కోట్లు హాంఫట్!
- ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ భయాలతో మార్కెట్లో ఒడిదుడుకులు
- ఆచితూచి వ్యవహరించిన మదుపరులు
- భారీగా పతనమైన సెన్సెక్స్, నిఫ్టీ
భారత స్టాక్ మార్కెట్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజులోనే మదుపరుల సంపద రూ.9 లక్షల కోట్ల మేర హరించుకుపోయింది.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ భయాలతో మదుపరులు ఆచితూచి వ్యవహరించడంతో సెన్సెక్స్, నిఫ్టీ తీవ్రస్థాయిలో నష్టపోయాయి. ఈ రెండు ప్రధాన సూచీలు ఉదయం సెషన్ లో లాభాల్లోనే కనిపించినా, గంటలోనే ట్రెండ్ మారింది. సెన్సెక్స్, నిఫ్టీ వేగంగా పతనమయ్యాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 638 పాయింట్ల నష్టంతో 81,050 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 218 పాయింట్లు కోల్పోయి 24,795 వద్ద ముగిసింది.
ఐటీసీ, ఎయిర్ టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా లాభాల బాటలో పయనించగా... ఎన్టీపీసీ, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, రిలయన్స్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, నెస్లే, ఎల్ అండ్ టీ, హెచ్ యూఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నష్టాలు మూటగట్టుకున్నాయి.