Maldives: భారత పర్యాటకులకు సుస్వాగతం.. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు యు-టర్న్
- భారత పర్యాటకులు తిరిగి మాల్దీవులు రావాలని అభ్యర్థన
- భారత భద్రతకు ఏమాత్రం ఇబ్బంది కలిగించబోమని వ్యాఖ్య
- 5 రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు
ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లి అక్కడి సుందర దృశ్యాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.. మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు ప్రధాని మోదీని అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ‘బాయ్‌కాట్ మాల్దీవుల’ ఉద్యమం జరగడంతో భారతీయ పర్యాటకులు అక్కడికి వెళ్లడం మానుకున్నారు. ఫలితంగా మాల్దీవులకు కీలకమైన పర్యాటక రంగం కుంటుపడింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు స్వయంగా రంగంలోకి దిగారు.
భారత్ విలువైన భాగస్వామి..
5 రోజుల భారత పర్యటన కోసం నిన్న (ఆదివారం) ఢిల్లీ చేరుకున్న మహ్మద్ ముయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ పర్యాటకులు తిరిగి మాల్దీవులు రావాలని కోరారు. ‘‘భారతీయులు సానుకూల సహకారాన్ని అందిస్తారు. భారతీయ పర్యాటకులకు తిరిగి స్వాగతం’’ అని అభ్యర్థించారు. భారత భద్రతను దెబ్బతీసేలా మాల్దీవులు వ్యవహరించబోదని, భారత్ తమకు విలువైన భాగస్వామి, మిత్ర దేశమని ఆయన అన్నారు. రక్షణతో పాటు పలు రంగాలలో సహకారానికి భారత్‌కు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్, మాల్దీవుల బంధం గౌరవం, పరస్పర ఆసక్తుల ఆధారంగా ఏర్పడిందని అధ్యక్షుడు ముయిజ్జు అన్నారు. తమ దేశానికి అతిపెద్ద వాణిజ్య, అభివృద్ధి భాగస్వాములలో భారత్ ఒకటిగా ఉందని అన్నారు. ‘‘భారత్ భద్రతకు ఇబ్బంది కలిగేలా మాల్దీవులు ఎప్పటికీ ఏమీ చేయదు. ఇతర దేశాలతో వివిధ రంగాలలో మా సహకారాన్ని పెంపొందించుకుంటూనే మన ప్రాంతం భద్రత, స్థిరత్వానికి కట్టుబడి ఉంటాం’’ అని ముయిజ్జు అన్నారు. చైనా పేరును ఎత్తకపోయినప్పటికీ వైవిధ్యమైన అంతర్జాతీయ సహకారాల ద్వారా పురోగమించాలని భావిస్తున్నట్టు చెప్పారు. 'మాల్దీవ్స్ ఫస్ట్' అనే విధానం తమకు ప్రాధాన్యమని అన్నారు. ఒక దేశంపై అతిగా ఆధారపడటం తగ్గించడం చాలా అవసరమని ఆయన చెప్పారు. అయితే తమ విధానాలను కొనసాగిస్తూనే భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీయబోమని ఆయన స్పష్టం చేశారు. మొదటి ద్వైపాక్షిక పర్యటన కోసం ఆయన భారత్ విచ్చేశారు. ఈరోజు (సోమవారం) ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవనున్నారు.